కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కసరత్తు!
దేశంలో త్వరలోనే కరోనా టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ టీకాల పంపిణీ నెల 25వ తేదీ నుంచి చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సినేషన్ ఎలా చేపట్టాలన్న అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
ముఖ్యంగా, కరోనా టీకా అందుబాటులోకి వచ్చి తర్వాత ఏ విధంగా ముందుకుసాగాలన్న అంశంపై కొత్త ప్రామాణిక విధానాలను (ఎస్‌ఓపీ) కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించింది.
వినియోగదారులకు టీకాను వేగంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు, టీకా కార్యక్రమానికి సంబంధించి అన్ని అంశాలపై ఎస్ఓపీ దిశానిర్దేశం చేస్తుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. టీకా కార్యక్రమం ఎన్నికల ప్రక్రియను పోలి వుంటుందని తెలిపింది.
తొలి విడతలో వంద మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేస్తారని, మౌలిక వసతులు మెరుగ్గా ఉంటే ఈ సంఖ్య 200కు కూడా పెరుగుతుందని పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏయే రోజుల్లో చేపట్టాలన్నదానిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని వివరించింది.
కరోనా వ్యాక్సిన్లపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా స్పందించారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కావచ్చని తెలిపారు.
దేశంలో ఈ నెలఖరుకల్లా ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమయ్యే పూర్తి స్థాయి అనుమతులు పొందేందుకు కొంత సమయం పడుతుందని వివరించారు.
దేశంలో ఏదైనా వ్యాక్సిన్‌ను కనీసం 20 శాతం మందికి ఇస్తే దానిపై దేశ ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. దేశ ప్రజలందరికీ వచ్చే ఏడాది అక్టోబరులోపు టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీంతో ఆ సమయానికి కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు.