అబనాళి గ్రామంలో సగం మందికి కరోనా
కరోనా వైరస్ మహమ్మారి యావత్ భారతదేశాన్ని కమ్మేసింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోటా కరోనా వైరస్ వ్యాపించింది. దీంతో అనేక లక్షల మంది ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. అలాగే, వందల మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలో ఓ గ్రామంలో ఏకంగా సగం మంది వైరస్ బారినపడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. బెళగావిలోని అబనాళి గ్రామంలో 300 మంది జనాభా ఉండగా.. ఇందులో ఇప్పటివరకు 144 మంది వైరస్ బారినపడ్డారు.
మహారాష్ట్ర, గోవా సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామంలోని ప్రజలు ఉపాధి నిమిత్తం పొరుగు రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఇటీవల మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా కఠిన ఆంక్షలు విధించడంతో చాలా మంది కూలీలు స్వగ్రామానికి తిరిగొచ్చారు. ఏప్రిల్ 10న ఈ గ్రామానికి చెందిన ముగ్గురు జ్వరం, ఒళ్లు నొప్పులతో స్థానిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లారు.
అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ అధికారులు కాంటాక్ట్ చేపట్టలేదు. దీంతో వైరస్ వచ్చినవారు ఐసోలేషన్‌లో ఉండకుండా గ్రామంలో తిరిగారు. ఇటీవల ఒక్క రోజే 20 మందికి పైగా జ్వరంతో బాధపడుతూ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అధికారులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత గ్రామంలో రాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 144 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయని, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత గ్రామాన్ని సీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటకలో గత కొన్ని రోజులుగా వైరస్ ఉద్ధృతంగా ఉంది. గురువారం ఒక్కరోజే అక్కడ 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.