ఇటర్నేషనల్ కోచ్‌గా చేరాలంటే మా హైకమిషన్ పర్మిషన్ అడగాలి.. లేదంటే విడాకులు ఇస్తుంది : నెహ్రా
అంతర్జాతీయ క్రికెట్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలంటే ముందుగా మా హైకమిషన్ (భార్య) అనుమతి అడగాల్సి వుంటుందని లేనిపక్షంలో విడాకులు ఇస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అన్నారు. ప్రస్తుతం భారత్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌పై విస్తృతంగా చర్చ సాగుతోంది. దీనిపై ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలన్న ఆశ లేదన్నారు. కానీ భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడాలన్నారు.
'ముందుగా చెప్పాలంటే, నేను 'ఆశ' అనే పదాన్ని వాడను. భవిష్యత్తు గురించి నేనెప్పుడూ ప్లాన్ చేసుకోను. ఆ పదవి దక్కడం ఖచ్చితంగా గొప్ప గౌరవమే. కానీ, ప్రస్తుతానికి గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని నెహ్రా తెలిపాడు. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తదుపరి కోచ్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు నెహ్రా పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
అంతర్జాతీయ కోచింగ్ బాధ్యతల సవాళ్ల గురించి మాట్లాడుతూ.. "అది అంత సులభం కాదు. ఏడాదికి 8-9 నెలలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది కోచ్‌లు 3-4 ఏళ్లకు మించి కొనసాగలేరు. ఒకవేళ ఆ అవకాశం వస్తే, ముందుగా మా హైకమిషన్ అయిన నా భార్యను అడగాలి. లేదంటే విడాకులు ఇస్తుంది" అని నెహ్రా సరదాగా వ్యాఖ్యానించారు.
