ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ఆసియా క్రీడలు : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత్‌కు బంగారు పతకం

air pistol team
చైనా వేదికగా ఆసియా క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఐదో రోజు ఆరంభంలోనే భారత్ పసిడి, రజత పతకాలను కైవసం చేసుకుంది. తాజాగా పురుషులు 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు సరబ్ జ్యోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ బృందం బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో షూటింగ్‌లో ఆరో గోల్డ్‌ భారత్ వశమైంది. వ్యక్తిగత విభాగంలోనూ సరబ్‌జోత్, అర్జున్‌ సింగ్‌ పతకాల వేటకు అర్హత సాధించారు. 
 
గురువారం తొలుత పతకం అందించిన ఘనత మాత్రం రోషిబినా దేవిదే. వుషూ 60 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన రోషిబినా రజత పతకం సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో ఆమె కాంస్య పతకం గెలుచుకుంది. ఇప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయడం విశేషం. 
 
మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో భారత జోడీకి ఓటమి ఎదురైంది. ప్రస్తుతం భారత్ మొత్తం 24 పతకాలతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఇందులో 6 బంగారు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. 
 
అలాగే, ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్‌లో భారత క్రీడాకారులు హృదయ్‌, అనుష్‌, దివ్యకృతి సింగ్‌ చక్కని ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత డ్రెస్సేజ్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా పతక పోటీలోకి వచ్చారు. ఆసియా క్రీడల టెన్నిస్‌లో భారత జోడీ సాకేత్‌ మైనేని- రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక్కడా పతకాలు ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి.