మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 17 జులై 2017 (04:56 IST)

విరాట్ కోహ్లీకి ఏమాత్రం తీసిపోని ప్రతిభ ఆమె సొంతం. అయినా ఎందుకీ వివక్ష

టీమిండియా పురుషుల జట్టు సాధించలేని అరుదైన విజయాన్ని మన మహిళా క్రికెట్ జట్టు సాధించబోతోందా. ఆ నమ్మకానికి ఒకే ఒక స్ఫూర్తి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. భారతీయ మహిళా క్రికట్‌లో పూర్ణిమా, డయానా ఎడుల్జ్ వంటి మేటి క్రికెటర్లకు సాధ్యంకాని ఘనతన

టీమిండియా పురుషుల జట్టు సాధించలేని అరుదైన విజయాన్ని మన మహిళా క్రికెట్ జట్టు సాధించబోతోందా. ఆ నమ్మకానికి ఒకే ఒక స్ఫూర్తి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. భారతీయ మహిళా క్రికట్‌లో పూర్ణిమా, డయానా ఎడుల్జ్ వంటి మేటి క్రికెటర్లకు సాధ్యంకాని ఘనతను మిథాలీ సాధించారు. మహిళా క్రికెట్ అంటే విపరీతమైన చిన్న చూపు అటు ప్రేక్షకుల్లోనే కాదు. బీసీసీఐ యాజమాన్యంలో కూడా ఉంటున్న నేపథ్యాన్ని మార్చి భారత మహిళా క్రికెట్ ముఖ చిత్రం మారడానికి మిథాలీయే ప్రథాన కారణం.

2005 వన్డే వరల్డ్‌ కప్‌లో మిథాలీ నాయకత్వంలో భారత జట్టు ఫైనల్‌ చేరడంతో పలువురి మహిళలు క్రికెట్‌‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.  వేద కృష్ణమూర్తి, స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌...ఇలా ఎంతో మంది క్రికెట్‌ వైపు చూసేందుకు మిథాలీనే స్ఫూర్తి. 18 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో చిన్న వివాదం కూడా లేకుండా జట్టునుంచి అపారమైన గౌరవాన్ని అందుకుంటున్న అసాధారణ క్రికెటర్ మిథాలి. పురుషుల జట్టుకు అందుతున్న గౌరవాలు, రివార్డులు, భారీ నగదు ఏవీ లేకున్నా పంటిబిగువన సహిస్తూ అద్భుత విజయాలకు స్ఫూర్తి నిస్తున్న కెప్టెన్ మిథాలి.
 
మహిళా వన్డే క్రికెట్ లో అరుదైన రికార్డులను సాధించిన క్రికెటర్ భారత కెప్టెన్ మిథాలీ రాజ్. ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ పేరిట  ఉన్న 5992 పరుగుల వన్డే రికార్డును బద్ధలు కొట్టడంతో పాటు, ఈ ఫార్మాట్ లో ఆరువేల పరుగుల మైలురాయిని చేరిన తొలి మహిళా క్రికెటర్‌‌గా కూడా మిథాలీ క్రికెట్ పుస్తకాల్లో తన పేరును లిఖించుకుంది. 16 ఏళ్ల 205 రోజుల వయసులోనే భారత్‌ తరఫున తొలి వన్డే ఆడిన మిథాలీ సెంచరీతో చెలరేగి అతి పిన్న వయసులో ఆ ఘనత సాధించిన రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మిథాలీ పేరిటే ఆ రికార్డు ఉండటం విశేషం.
 
ఇప్పుడు భారత పురుష క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో సమానంగా కీర్తించబడుతున్న ఏకైక క్రికెటర్ మిథాలీనే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ ముద్ర ఎలా ఉంటుందో అదే తరహాలో మిథాలీ కూడా జట్టును ముందుండి నడిపించే తీరు ఆమెను అగ్రస్థానంలో నిలుపుతోంది. ప్రధానంగా 2017లో మిథాలీ రాజ్ ఫామ్ అద్వితీయంగా ఉంది. వన్డేల్లో ఓవరాల్ గా ఆరు సెంచరీలు సాధించిన మిథాలీ.. 2017లో మాత్రం టాప్ గేర్‌లో దూసుకుపోతుంది. ఈ ఏడాది మిథాలీ తొమ్మిది హాఫ్ సెంచరీలను, ఒక సెంచరీని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో వరుసగా ఏడు హాఫ్ సెంచరీల రికార్డు కూడా ఉండటం విశేషం. ప్రధానంగా కీలక మ్యాచ్‌ల్లో భారత్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. 
 
ఇక్కడ దాదాపు విరాట్ కోహ్లితో సమానంగా రాణిస్తూ మహిళా క్రికెట్ అభివృద్ధిలో తనవంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తుంది. ఈ ఏడాది 13 వన్డే మ్యాచ్ లు ఆడిన మిథాలీ 676 పరుగులు నమోదు చేయగా.. కోహ్లి 14 మ్యాచ్ ల్లో 695 పరుగులు చేశాడు. దాంతో ద లేడీ విరాట్ గా మిథాలీ మన్ననలు అందుకుంటుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరిగిన చావోరేవో మ్యాచ్ లో మిథాలీ సెంచరీ సాధించి భారత్ ను సెమీస్ కు చేర్చడంలో సహకరించింది. ఇక కప్ ను అందుకోవడానికి భారత మహిళా క్రికెట్ జట్టుకు రెండు అడుగుల దూరం మాత్రమే ఉంది. భారత జట్టు వరల్డ్ కప్ తిరిగొస్తే మాత్రం మన మహిళా క్రికెట్ కు మరింత ఆదరణ ఖాయం. 
 
విరాట్ కోహ్లీ కన్నా సీనియర్, కోహ్లీకి ఏమాత్రం తీసిపోని రీతిలో పరుగులు తీస్తూ భారత మహిళా క్రికెట్‌ను శిఖరస్థాయికి తీసుకుపోతున్న మిథాలి రాజ్‌కు ఆమె టీమ్‌కు దొరుకుతున్న పురస్కారం కానీ, గుర్తింపు కాని చాలా తక్కువే కావచ్చు కానీ క్రీడారంగంలో గొప్ప విజయాలు సాధిస్తున్న మిథాలీ టీమ్‌ పట్ల బీసీసీఐ ప్రదర్శిస్తున్న వివక్షకు ఇకనైనా ముగింపు పలుకుతారా?