1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (17:34 IST)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే.. ఐసీసీ

cricket ground rain
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. 19వ తేదీన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం రిజర్వ్‌ డేను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే మరుసటి రోజున ఆ మ్యాచ్‌ నిర్వహించేందుకు వీలుగా ఈ రిజర్వ్ డేను ప్రకటించింది. అలాగే, సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు కూడా ఈ రిజర్వ్ డే ప్రకటించింది. 
 
ప్రతికూల వాతావరణం వల్ల కనీసం 20 ఓవర్ల చొప్పున కూడా మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి ఉత్పన్నమైతే ఆ మ్యాచ్‌ను రిజర్వు డేకి మళ్లిస్తారు. అయితే, బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఎలాంటి వర్ష సూచన లేదు. దీంతో ఐసీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్ జరిగే ముంబై వాంఖడే స్టేడియంలో వర్షం పడేందుకు కేవలం మూడు శాతం మాత్రమే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
అలాగే, 16వ తేదీన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగనుంది. ఇక్కడ వర్షం పడే అవకాశాలు పగటిపూట 54 శాతం, రాత్రివేళ 75 శాతం ఉందని పేర్కొంది. అలాగే, ఫైనల్ జరిగే ఆదివారం కూడా ఎలాంటి వర్షపు ముప్పు లేదని వాతావరణ సంస్థలు వెల్లడించిన నివేదికల్లో పేర్కొన్నాయి. 
 
ఇక వర్షం వల్ల రిజర్వ్‌ డేలో కూడా మ్యాచ్ జరిపేందుకు వీలు కాకపోతే పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా తొలి సెమీస్ నుంచి భారత్, రెండో సెమీస్ నుంచి సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరుతాయి. ఫైనల్ కూడా పూర్తిగా రిజర్వ్ డేతో సహా వర్షార్పణం అయితే, లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్‌ను విజేతగా నిలుస్తుంది.