ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 9 మే 2018 (13:25 IST)

విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారం ఏమిటి?

ఫిట్నెస్.. ఫిట్నెస్.. ఫిట్నెస్‌.. ఇది టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జపిస్తున్న మంత్రం, ఈ క్రికెటర్‌ అలుపెరగని ఆట చూశాక దేశ యువత కూడా ఇదే మంత్రాన్ని జపిస్తోంది. అటు టెస్ట్‌లు, ఇటు వన్డేలు, టీ20లు.

ఫిట్నెస్.. ఫిట్నెస్.. ఫిట్నెస్‌.. ఇది టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జపిస్తున్న మంత్రం, ఈ క్రికెటర్‌ అలుపెరగని ఆట చూశాక దేశ యువత కూడా ఇదే మంత్రాన్ని జపిస్తోంది. అటు టెస్ట్‌లు, ఇటు వన్డేలు, టీ20లు.. ఇవిగాక మండు వేసవిలో ఐపీఎల్‌. ఏ సిరీస్‌కు ఆ సిరీస్‌కు ఎంతో తాజాగా బరిలో దిగే విరాట్‌ను చూస్తే తోటి క్రికెటర్లకే అసూయ కలుగుతుందంటే అతిశయోక్తి కాదేమో! అవును.. అతనలా కాపాడుకుంటాడు తన ఫిట్నెస్‌ను. కేవలం ఫిట్నెస్‌ కాదు.. డైట్‌ విషయంలోనూ కోహ్లీ మహా స్ట్రిక్ట్. కోహ్లీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఓసారి పరిశీలిద్ధాం.
 
విరాట్‌ ఎక్కువగా ఉడకబెట్టిన ఆహారాన్ని తీసుకుంటాడు. జంక్‌ ఫుడ్‌కుపూర్తిగా దూరంగా ఉంటాడు. ఆకలిగా అనిపించినప్పుడు వేయించిన చిప్స్‌ కన్నా.. గోధుమలతో తయారైన పదార్థాలను ఇష్టపడతాడు. ముఖ్యంగా నట్స్‌కు అతడు ఎంతో ప్రాముఖ్యం ఇస్తాడు. అవి తిన్నాక ఓ కప్‌ బ్లాక్‌ కాఫీ తాగుతాడు. 
 
బ్రేక్‌ఫాస్ట్‌లో మూడు గుడ్లతో ఓ ఆమ్లెట్‌. మిరియాల పొడి చల్లిన ఉడకబెట్టిన ఆకుకూర. జున్ను, కాల్చిన పంది మాంసం లేదా కాల్చిన సముద్రపు చేపలు. అందుబాటులో ఉంటే డ్రాగన్‌ ఫ్రూట్‌. లేదంటే బొప్పాయి, పుచ్చకాయ ముక్కలు. మంచి ఫ్యాట్‌ కోసం వెన్న తింటాడు. వెంట ఎప్పుడూ పల్లీలు ఉంటాయి. హోటళ్లలో ఉన్నప్పుడు గ్లూటెన్‌ లేని బ్రెడ్‌ను ప్రత్యేకంగా తెప్పించుకొని తింటాడు. నిమ్మకాయతో కూడిన పెద్దకప్పు గ్రీన్‌ టీ తాగుతాడు. 
 
లంచ్‌.. డిన్నర్‌.. ఇలా
కండరాల పటుత్వం పెంచుకోవడానికి ట్రెయినర్‌ శంకర బసు సూచించిన రెడ్‌ మీట్‌ తీసుకొంటాడు. లేదంటే కాల్చిన చికెన్‌తోపాటు ఆలుగడ్డ గుజ్జు, తాజా ఆకుకూరలు తీసుకుంటాడు. డిన్నర్‌లో ఎక్కువగా సముద్రపు ఆహారం ఉంటుంది. మ్యాచ్‌ల రోజుల్లో రాత్రిపూట తేలికపాటు ఆహారం తీసుకుంటాడు. కార్బోహైడ్రేట్లతోపాటు ప్రొటీన్‌ షేక్స్‌కు ప్రాధాన్యమిస్తాడు. సాధారణ నీటిని కోహ్లీ అస్సలు తాగడు. ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఇవియాన్‌ బ్రాండ్‌ మినరల్‌ వాటర్‌ మాత్రమే తాగుతాడు. 
 
ఇకపోతే, విరాట్ కోహ్లీ రేయింబవుళ్లూ కసరత్తులు చేస్తుంటారు. ఆయన చేసే వ్యాయామాలు ఇలా ఉంటాయి. 
 
* ఇంట్లో ఉంటే.. రోజూ రెండు గంటల చొప్పున వారంలో ఐదు రోజులు జిమ్‌లో సాధన చేస్తాడు. పర్యటనల సందర్భాల్లోనూ సాధ్యమైనంతగా ఇదే ప్రణాళిక ఆచరిస్తాడు. 
* జిమ్‌లో వివిధ రకాల బరువులెత్తడంతోపాటు కార్డియో ఎక్సర్‌సైజులుంటాయి. ఈ రెండింటితో కండరాలు దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా శరీరంలోని కిందిభాగం కండరాలు బాగా పటిష్టమవుతాయి. దాని ఫలితమే వికెట్ల మధ్య విరాట్‌ వేగంగా పరుగెత్తగలగడం. అంతేకాదు ఫీల్డింగ్‌లో ఎంత దూరం నుంచైనా బలంగా బంతిని విసరగలగడం. 
 
* ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం. ఈ అలవాట్లు లేకపోవడంతో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 
* అత్యాధునిక మాస్క్‌ను జిమ్‌లో ఉపయోగిస్తాడు. దీనిని ధరించి సాధన చేయడంవల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. 
* టెక్నోషాపర్‌.. సాధనలో కోహ్లీ వినియోగించే మరో పరికరం. పొత్తికడుపులోని కొవ్వును తగ్గించడంతోపాటు నడుము భాగాన్ని పొందికగా ఉంచుతుంది. చర్మం మృదువుగా ఉండేందుకు ఈ పరికరం తోడ్పడుతుంది.