ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని కాల్చి చంపిన రిటైర్డ్ ఎస్ఐ!!
ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను కన్నతండ్రే తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు భర్తతో కలిసి కుమార్తె హాజరుకాగా, ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త గాయపడ్డాడు. జల్గావ్ జిల్లాలో శనివారం రాత్రి ఈ విషాదకర ఘటన జరిగింది.
జల్గావ్‌కు చెందిన తృప్తి (24) అవినాష్ వాగ్ (28) ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకార నిమిత్తం లేకుండా రెండేళ్ల క్రితం వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. తృప్తి తండ్రి, రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఎస్ఐ అయిన కిరణ్ మాంగ్లేకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటి నుంచి కూతురు, అల్లుడుపై ఆయన కోపంగా కోపంగా ఉన్నాడు.
కాగా, శనివారం రాత్రి చోప్డా పట్టణంలో అవినాష్ సోదరి హల్దీ కార్యక్రమం (పసుపు వేడుక) జరిగింది. ఈ వేడుకకు తృప్తి అవినాష్ దంపతులు హాజరయ్యారు. ఈ విషయం కిరణ్ మాంగ్లేకు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో అక్కడకు చేరుకుని, తన వెంట తెచ్చుకున్న సర్వీస్ రివాల్వర్‌తో కూతురు తృప్తిపై కాల్పు జరిపాడు. ఈ కాల్పుల్లో తృప్తి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన అవినాష్ వాగ్ కూడా కాల్పుల్లో గాయపడ్డారు.
కళ్ల ముందే జరిగిన ఈ దారుణాన్ని చూసి వెళ్లి వేడుకకు హాజరైన బంధువులు, అతిథుల తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కిరణ్ మాంగ్లేను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో కిరణ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తృప్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన అవినాశ్‌ను, అతిథులు దాడిలో గాయపడిన కిరణ్ మాంగ్లేను చికిత్స కోసం జల్గావ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.