నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్
భారత్‌కు లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచనిస్థితి నెలకొంది. ఈ ఒప్పందం రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామంటూ పాక్ నేతలు ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలో లష్కర్ తోయిబా చీఫ్, వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "నీళ్లు ఆపేస్తే మోడీ శ్వాస ఆపేస్తాం.. కాశ్మీర్ నదుల్లో హిందువుల రక్తం ఏరులై పారిస్తాం. యుద్ధం మొదలు పెడతాం. మీ అంతు చూస్తాం" అంటూ హెచ్చరించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
"పాకిస్థాన్‌కు నీళ్లు ఆపుతారా. మీ ఊపిరి ఆపేస్తాం జాగ్రత్త అంటూ హఫీజ్ సయీద్.... భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. సింధూ నదిలో నీళ్లకు బదులు మీ రక్తం పారిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేం బంగ్లాదేశ్‌ను విడదీశామని ఢాకాలో నిలబడి చెబుతున్నారా? అని మోడీపై ధ్వజమెత్తాడు.
ఇందుకోసం నువ్వు రక్తం ఇచ్చావని చెబుతున్నావ్ కదా అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. మేం మౌనంగా ఉండేది లేదని, నువ్వు అంటే మేమూ అంటామని హఫీజ్ తీవ్ర హెచ్చరికలు జారీచేశాడు. కాశ్మీర్‌లో డ్యాం కట్టి పాకిస్థాన్‌కు నీళ్లు ఆపుతారా, మేం చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డాడు. ఈ వీడియో ఇప్పటిది కాదనీ, అది పాత వీడియోగా చెబుతున్నారు.