అత్యాచారాన్ని ప్రతిఘటించిన నర్సు ... చంపేసిన కామాంధుడు
హైదరాబాద్ నగరంలో ఇటీవల ఓ నర్సు అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో ఆ నర్సును కామాంధుడు హత్య చేసినట్టు పోలీసులు నిగ్గుతేల్చారు. 21 యేళ్ళ మృతురాలిని కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు.
ఏడు నెలల క్రితం ఉపాధి కోసం హైదరబాద్ నగరానికి వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా ఆమె ఆస్పత్రిలో కేటాయించిన గదిలో ఉంటూ వచ్చింది. శనివారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చి, తలుపులు విరగ్గొట్టి చూడగా యువతి నేలపై విగతజీవిగా పడివుంది. పైగా ఆమె శరీరంపై గాయాలు ఉండటాన్ని గుర్తించారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేపట్టారు. ఇందులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్న సైనావుల్లా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు.
శనివారం మధ్యాహ్నం కిటికీలోంచి నర్సు గదిలోకి దూకి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్టు తెలిపారు. అయితే, బాధితురాలు గట్టిగా ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో భయపడిపోయి గొంతు నులిమి హత్య చేసి పారిపోయినట్టు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
