ఇద్దరి ప్రాణాలు తీసిన వేప చెట్టు వివాదం.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువు మండలం ఎర్రగడ్డ తాండాలో ఓ వేప చెట్టు వివాదం ఇద్దరి ప్రాణాలను తీసింది. ఒక వేప చెట్టు కోసం రెండు వర్గాల ప్రజలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇద్రు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఈ కేసును పక్కదారి పట్టించేందుకు కుమారుడే కన్నతండ్రిని చంపడం మరింత విషాదంగా మారింది.
ఇంటి సరిహద్దులో ఉన్న వేప చెట్టు విషయంలో వెంకటేశ్వర్లు, భూక్యా సైదా కుటుంబాల మధ్య 25 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం వెంకటేశ్వర్లు కొంతమందిని పిలిచి వేపచెట్టు నరికించారు. భూక్యా సైదా కుమారుడు రాము ఈ విషయాన్ని గమనించి వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి.. చెట్టు విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి, ఎలా చెట్టును కొట్టేస్తారని ప్రశ్నించారు. దీంతో గొడవ పెద్దది కావడంతో భూక్యా రాము గొడ్డలితో దాడి చేయడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదంతా గమనించిన భూక్యా రాము తండ్రి సైదా అక్కడికి వెళ్లి అడ్డుకోబోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాము తన తండ్రిపై కూడా గొడ్డలితో దాడి చేయడంతో సైదా కూడా మృతి చెందారు. వేప చెట్టు విషయంలో పరస్పరం జరిగిన దాడుల్లో వెంకటేశ్వర్లు మృతి చెందాడని చిత్రీకరించేందుకే రాము తన తండ్రిపై దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు.
ఇదంతా గమనించిన గ్రామస్థులు భూక్యా రాము ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మేళ్ల చెరువు ఎస్ఐ నవీన్ కుమార్ తలకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
