జార్ఖండ్ రాష్ట్రంలో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం...
జార్ఖండ్ రాష్ట్రంలో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏడుగురు కామాంధులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో మహిళ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దేవుడి దయ వల్ల తాము బతికి ఉన్నామని బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
"మాపై జరిగిన దారుణం ఇకముందు మెరెవరిపైనా జరగొద్దు. ఏడుగురు వ్యక్తులు నాపై లైంగికదాడికి పాల్పడ్డారు" అంటూ జార్ఖండ్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన 28 యేళ్ల స్పానిష్ మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆ వీడియాలో ఆమె ముఖం ఉబ్బిపోయి కనిపిస్తుంది. ముఖం నిండా గాయాలు ఉన్నాయి. తామిక బతుకుతామని అనుకోలేదని, దేవుడి దయవల్లే బతికామని వీడియోలో పేర్కొంది.
ఈ మహిళ తన భర్తతో కలిసి ఐదేళ్ల క్రితం ప్రపంచ యాత్ర చేసేందుకు నిర్ణయించుకుని, మొత్తం 63 దేశాలను చుట్టేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందులోభాగంగా 1.7 లక్షల కిలోమీటర్ల జర్నీ చేయాలని భావించారు. స్పెయిన్ నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మీదుగా భారతలోకి బీహార్ రాష్ట్రంలో అడుగుపెట్టారు. అక్కడ నుంచి నేపాల్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ జార్ఖండ్ రాష్ట్రంలో వారు కామాధుల చేతికి చిక్కారు.
రాత్రిపూట రోడ్డు పక్కనే టెంట్‌లో నిద్రిస్తున్న జంటపై దాడి చేసిన దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ బాధను వెళ్ళగక్కుతూ వారు షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన జార్కండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ బృందం ఇప్పటివరకు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తున్నారు.