గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జనవరి 2024 (12:26 IST)

భార్య ఆత్మహత్య.. బంధువుల దాడిలో భర్త మృతి

suicide
తెలంగాణాలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామం విషాదకర ఘటన జరిగింది. కుటుంబ కలహాలు కారణంగా భార్య ఆత్మహత్య చేసుకుంటే, బంధువుల దాడిలో ఆమె భర్త చనిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన నాగార్జున(28) అచ్చంపేటలోని దగ్గరి బంధువుకు చెందిన ఆసుపత్రి నిర్వహణ చూసుకునేవాడు. రెండేళ్ల క్రితం స్థానికురాలైన సింధు(21)ను ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టణంలోనే కాపురం పెట్టాడు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
 
ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సింధు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటికి వెళ్లిన భర్త గమనించి వెంటనే ఆమెను తాను పని చేసే ఆసుపత్రికి తరలించాడు. అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వాసుపత్రికి, అనంతరం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
అదేరోజు రాత్రి మృతదేహంతో తిరిగి అచ్చంపేటకు వస్తుండగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సమీపంలో సింధు బంధువులు అంబులెన్సును అడ్డుకున్నారు. తమ కారులో నాగార్జునను ఎక్కించుకొని.. అంబులెన్సును అచ్చంపేటకు పంపించేశారు. నాగార్జున ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబసభ్యులు శనివారం తెల్లవారుజామున అచ్చంపేట పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ మేరకు కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టగా పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానం సమీపంలో నిలిపి ఉన్న ఓ కారులో నాగార్జున ఒంటిపై గాయాలతో విగతజీవిగా కనిపించాడు. తన కుమారుడిని సింధు కుటుంబసభ్యులే కొట్టి చంపేశారని ఆరోపిస్తూ నాగార్జున తల్లి స్వర్ణ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అదనపు కట్నం పేరుతో చిత్రహింసలకు గురిచేసి తన కూతురు ఆత్మహత్యకు కారణమయ్యారని సింధు తండ్రి శ్రీనివాసులు కూడా ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.