ఆ రాష్ట్ర మహిళలు పక్కా తాగుబోతులా?
దేశంలో ప్రతి యేడాది మద్యంబాబుల సంఖ్య పెరిగిపోతోంది. దేశ వృద్ధిరేటు సంగతి ఏమోగానీ... మద్యంబాబుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. అందువల్లే అనేక రాష్ట్రాలకు మద్యం అమ్మకాలే ప్రధాన ఆదాయ నవరుగా మారిపోయింది. అయితే, ఇటీవలి కాలంలో మద్యం సేవించే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఇందులో ఈశాన్య రాష్ట్రమైన అస్సాం మహిళలు దేశంలోని ఇతర రాష్ట్రాల మహిళా మణులతో పోల్చుకుంటే అగ్రస్థానంలో ఉన్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే, మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అస్సాంలో మద్యం తాగుతున్న మహిళల సంఖ్య అధికంగా ఉంది. ఈ సర్వే వెల్లడించిన గణాంకాల మేరకు 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో 26.3 శాతం మద్యం తాగుతున్నట్టు 2019-20 గణాంకాలను బట్టి తెలుస్తోంది.
అలాగే, అస్సాం పొరుగున ఉన్న మేఘాలయలో మాత్రం ఇది 8.7 శాతంగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా మద్యం తీసుకుంటున్న మహిళల్లో పైన పేర్కొన్న వయసు వారు 1.2 శాతమేనని 2015-16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) 4 నివేదికలో పేర్కొన్నారు. 2018-19 నాటి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 5 సర్వే నివేదిక ఇంకా విడుదల కావాల్సి ఉంది.
2005-06 ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 3 సర్వే ప్రకారం 15-49 ఏళ్ల వయసున్న అస్సాం మహిళల్లో మద్యం తాగేవారు 7.5 శాతంగా ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో 33.6 శాతం, సిక్కింలో 19.1శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 11.4 శాతం, జార్ఖండ్‌లో 9.9 శాతం, త్రిపురలో 9.6 శాతం మంది ఉన్నారు. సర్వే 3లో 7.5 శాతంగా ఉన్న మద్యం తాగే అస్సాం మహిళల శాతం, సర్వే 4లో మాత్రం మిగతా రాష్ట్రాలను దాటేసి 26.3 శాతానికి పెరిగింది.
అదేసమయంలో సర్వే 3లో అస్సాం కంటే ముందున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్‌గడ్, ఝార్ఖండ్, త్రిపురలలో అది వరుసగా 3.3, 0.3, 0.2, 0.3, 0.8 శాతంగా నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వారానికి ఒకసారి మద్యం తాగుతున్న మహిళలు 35 శాతం కాగా, అస్సాంలో ఇది ఏకంగా 44.8 శాతంగా ఉంది.
అలాగే, 15-49 ఏళ్ల వయసున్న అస్సాం పురుషుల్లో 35.6 శాతం మంది మద్యం తాగుతున్నారు. దీంతోపాటు పొగాకు వినియోగంలోనూ అస్సాం మహిళలు (60 శాతం), పురుషులు (17.7 శాతం)తో మిగతా రాష్ట్రాల కంటే ముందుండటం గమనార్హం.