నేడు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ... నేతల సందేశాలు...
దేశ ప్రజల్లో సమానత్వం కోసం అహర్నిశలు పరితపించిన కృషీవలుడు, మేథావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఏప్రిల్ 14వ తేదీన జరుగుతున్నాయి.
బ్రీటీష్ పాలకుల కబంధ హస్తాల నుంచి దేశమంతా స్వేచ్చావాయువుల కోసం తపిస్తోన్న స్వాతంత్య్రోద్యమ కాలంలో బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన ధీశాలి.
మహాత్మాగాంధీ నేతృత్వంలో సాగిన భారతస్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా, దేశంలో సామాజిక అణచివేతను సవాలు చేసిన వాళ్లలో అంబేద్కర్ ప్రముఖంగా వినిపిస్తారు. సామాజిక రంగంపై అంబేద్కర్ చూపిన బలమైన ముద్ర భారతదేశ రాజ్యాంగ రచనా సమయంలో పౌరులందరి సామాజిక, రాజకీయ సమానత్వం పట్ల విస్తృతమైన ఆమోదానికి వీలు కల్పించింది.
ఫలితంగా సామాజిక చట్రంలో ఆచారాల కింద నలిగిపోయిన వారిని ఉద్ధరించే రీతిలో భారత రాజ్యాంగ రూపకల్పన జరిగింది. బ్రిటిషర్ల పాలనా కాలంలో దేశ పౌరులందరికీ ఓటు ఉండేది కాదు. పన్ను చెల్లింపుదారులు, విద్యావంతులు మాత్రమే ఓటు వేసేవారు.
ఆ తర్వాత నెహ్రూ సాయంతో అంబేద్కర్ రాజ్యాంగంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కును ముందుకు తీసుకొచ్చారు. ఈ భావన తర్వాత పార్లమెంటులో గిరిజన ప్రాతినిధ్య హక్కుల పరికల్పనకు కూడా వీలు కల్పించింది.
పంచాయతీలు, పురపాలక సంస్థల్లో కూడా దళితులకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్య హక్కులు లభించాయి. 1932 సెప్టెంబర్‌లో పూనా ఒడంబడికపై సంతకం చేయడం ద్వారా గాంధీ ప్రాణాలను కాపాడటంలో అంబేద్కర్ నిర్వహించిన పాత్రతో విశిష్టమైంది. పూనా ఒడంబడిక తర్వాతే గాంధీ దళితులకు దేవాలయ ప్రవేశంపై ఉద్యమం ప్రారంభించారు. ఇలా 1950లో భారత రాజ్యాంగంలో ఈ హక్కులన్నింటినీ పొందుపర్చడానికి అంబేద్కర్ కృషి ఎంతో దోహదపడింది.
కాగా, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ప్రముఖులు తమ సందేశాలను వినిపిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు బాబా సాహెబ్. అని పేర్కొన్నారు.