శశికళను ఎగదోసిన తంబిదొరైకు మోదీ షాక్... ఎన్డీఏలో మంత్రులుగా సెల్వం ఎంపీలు...?
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం... ఇదీ భాజపా ఫార్ములా అనే ప్రచారం జరిగింది. భాజపా అధినాయకుల మాటలను బేఖాతరు చేస్తూ శశికళ తల ఎగరేశారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే చందంగా ముంద
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం... ఇదీ భాజపా ఫార్ములా అనే ప్రచారం జరిగింది. భాజపా అధినాయకుల మాటలను బేఖాతరు చేస్తూ శశికళ తల ఎగరేశారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే చందంగా ముందుకు దూకారు. ఎమ్మెల్యేలంతా తనవైపు వున్నప్పుడు కేంద్రం ఏం చేయగలదన్న ధీమాతో మొండిగా ముందుకు కదిలారు. పర్యవసానం ఏం జరిగిందో తెలిసిందే. ఐతే శశికళకు ఇంతగా ధైర్యం నూరిపోసినవారు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా వున్న తంబిదొరై అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన స్వయంగా పన్నీర్ సెల్వంపై ఒత్తిడి తెచ్చి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తంబిదొరై నిర్ణయం కారణంగానే ఇంత రచ్చ జరిగిందనీ, ఆయన శశికళతో సంయమనం పాటించమని చెప్పి వున్నట్లయితే తమిళనాడులో ఇంత రాజకీయ రభస జరిగి వుండేది కాదని అంటున్నారు. ఇన్ని సమస్యలకు కారకులైన తంబిదొరైని ఇక డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని భాజపా భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు తమ మాటను తు.చ తప్పకుండా పాటించి నష్టపోయిన పన్నీర్ సెల్వం వర్గానికి మేలు చేకూర్చేందుకు భాజపా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా పన్నీర్ సెల్వంపై విశ్వాసం వుంచి ఆయన వెంట నడిచిన ఎంపీలను ఎన్డీఏలోకి తీసుకుని వారికి మంత్రి పదవులు కట్టబెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.
అలాగే మిగిలినవారికి కూడా చెప్పుకోదగ్గ పదవులను ఇవ్వడం ద్వారా ఆదుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జయలలిత మేనకోడలు దీపకు పవర్ ఫుల్ పదవి ఇవ్వడమే కాకుండా సినీ నటి గౌతమిని కూడా పార్టీలోకి తీసుకుని భాజపా తమిళనాడులో పాతుకుపోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.