గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (20:08 IST)

తిరుమలలోనే హనుమంతుడు పుట్టాడట, ఇవిగో ఆధారాలు..?

ఏడు కొండల్లో అంజనీ పుత్రుడు జన్మించాడని.. చారిత్రాత్మక ఆధారాలను ఉన్నాయని టిటిడి చెబుతూ తిరుమలలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అట్టహాసంగా పలు కార్యక్రమాలను టిటిడి నిర్ణయించింది. పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి చెంత అంజనా దేవి పుత్రుడు హనుమాన్ జన్మస్ధలం వైభవంను భక్త జనులకు తెలిపేందుకు టిటిడి శ్రీకారం చుట్టింది. శేషాచలంలోని అంజనాద్రి హనుమంతుని జన్మస్ధలంగా వాజ్మయ, పౌరాణిక, చారిత్రక, శాసన ఆధారాల సమన్వయంతో నిర్ధారించింది టిటిడి.

 
కలియుగ వైకుంఠంలో వాయుపుత్రుని ఆలయాలు అనేకం, శ్రీవారి ఆలయంకు అభిముఖంగా బేడీ ఆంజనేయస్వామి ఆలయంతో మొదలు, పాపవినాశనంకు వెళ్ళే మార్గంలో బాలహనుంతుడి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ధర్మగిరి వేద పాఠశాల సమీపంలో అభయాంజనేయ స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే తిరుమలకు నలువైపులా అంజనాదేవి పుత్రుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి.

 
అయితే హనుమంతుని జన్మస్ధలంపై భక్తులకు అనేక సందేహాలు అలాగే మిగిలే పోయింది.‌ హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో హనుమంతుడు జన్మించాడని భక్తుల్లో నెలకొన్న సందేహాలు తీర్చుకునేందుకు టిటిడి ఒక స్పష్టమైన నివేదికను సమర్పించాలని భక్తులు కోరడంతో 15-12-2019 వ తేదీన జాతీయ సాంస్కృతి విశ్వవిద్యాలయ కులపతి మురళిధర్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఓ కమిటీని‌ ఏర్పాటు చేసింది టిటిడి.

 
అటు తరువాత పురాణాలు, శాసనాలు ఆధారంగా శ్రీరామ నవమి నాడు అంటే 21-04-21వ తేదీన భనర్వల్ పురోహిత్ ఆధ్వర్యంలో హనుమన్ జన్మస్ధలం అంజనాద్రిగా కమిటీ నిర్ధారించింది. పీఠాధిపతులు, మఠాధిపతులు, హనుమన్ భక్తుల ఆధారాలు పరిశీలచేందుకు రెండు రోజుల పాటు తిరుపతిలో జాతీయ వెబినార్‌ను టిటిడి నిర్వహించింది. కానీ అక్కడ కూడా టిటిడి నిర్ధారించిన ఆధారాలను పరిశీలించిన మఠాధిపతులు,‌ ఫీఠాధిపతులు, హనుమన్ భక్తులు నిజమైన అంజనీపుత్రుడి జన్మస్ధలం శేషాచలంలోని అంజానాద్రిగా జాతీయ వెబినార్‌లో స్పష్టం చేశారు. 

 
వైకుంఠనాధుడు కొలువైయున్న ఏడుకొండలను బుషులు, మహర్షులు ఎన్నో పేర్లతో కీర్తించారు.. ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో ఏడుకొండలు పిలువబడింది. కృతయుగంలో వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపర యుగంలో శేషాద్రిగా, కలియుగంలో వేంకటాద్రిగా ప్రాశస్త్యం పొందింది. అంతేకాకుండా శ్రీవారికి పరమ భక్తులైన అన్నమాచార్యులు, పురందర దాసు, వెంగమాంబ వంటి వారు అంజనాద్రి పర్వతం గురించి కీర్తనల్లో ప్రసావించినట్లు మనకు తెలుసు.

 
అంతేకాకుండా అంజనాద్రి హనుమంతుడి‌ జన్మస్థలంగా శ్రీ వేంకటాచల మహత్యంలో పేర్కోనబడింది. ఇదే అంశాన్ని పద్మ, స్కంద బ్రహ్మాండ పురాణంలో హనుమన్ జన్మస్ధలం ప్రస్తావన ఉందని అంటున్నారు. శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నుండి శ్రీలంకకు ప్రయాణించిన మార్గాన్ని వైజ్ఞానికంగా అక్షాంశాలు, రేఖాంశాలతో తిరుమల హనుమ జన్మస్ధలంగా రుజువు అవుతున్నాయని భౌగోళిక నిపుణులు అంటున్నారు. హోమాలు, క్రతువుల్లో చతుర్ణామాలతో అర్చన చేస్తారని, త్రేతాయుగంలో తిరుమల ఆంజనేయ స్వామి వారి జన్మస్ధలంగా ప్రసిద్దికెక్కిందని పురాణాలు చెప్తున్నాయి.

 
ప్రతి గురువారం నిర్వహించే తిరుపావైసేవలో పఠించే శ్రీనివాస గద్యంలో అంజనాద్రి ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు. అంతేకాకుండా ఋగ్వేదం నుండి వర్తమాన సాహిత్యం వరకూ అన్ని పదాల్లో తిరుమల అంజనాద్రే అని నిరూపించబడింది. దానికి సాహిత్య ఆధారాలు కూడా ఉన్నాయి.

 
మధ్యప్రదేశ్ చిత్రకూట్ లోని రామభధ్రచార్య అనుగ్రహ భాషణం చేశారట. గోవింద రాజీయంలో తిరుమల అంజానద్రి హనుమంతుని జన్మ స్ధలంగా చెప్పబడిందని, శేషాచలంలోని అంజనాద్రిలో అంజనాదేవి తపస్సు చేసి హనుమంతునికి జన్మనిచ్చిందని అందువల్లే ఈ కొండకు అంజనాద్రి అని పేరు రాబడిందని వెంకటాచల మహత్యంలో పేర్కోనబడింది.

 
ఏడుకొండల్లోని ఆకాశగంగ హనుమంతుని జన్మస్ధలంగా టిటిడి నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో‌ఈ నెల 16వ తేదీన మాఘపౌర్ణమి నాడు హనుమన్ జన్మస్ధలం అభివృద్ధి కార్యక్రమాలకు టిటిడి భూమి పూజ నిర్వహించింది. ఉదయం 9:30 గంటల 11 గంటల నడుమ ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంజనాద్రిలోని భూమి పూజ కార్యక్రమంకు విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్ర చార్యులు, కోటేశ్వరశర్మ తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 
హనుమంతుడు జన్మ వృత్తాంతంపై టిటిడి ఇ-పుస్తకంను విడుదల చేయనుంది. ఆకాశగంగలోని అంజనాదేవి ఆలయం, బాల హనుమాన్ ఆలయంకు ముఖమండపం, గోపురంను నిర్మించనున్నారు. అంతేకాకుండా గోగర్భం డ్యాం వద్ద దాతల సహాయంతో రోటరీను ఏర్పాటు చేయనున్నారు. ఇక హనుమజ్జన్మస్థల వైభవం తెలియాలంటే సాధారణంగా ఆలయాలు మామూలుగా ఉంటే సరిపోదని భావించింది టీటీడీ.

 
యాదాద్రి ఆలయం తరహాలో హనుమజ్జన్మస్థల ఆలయ నిర్మాణాన్ని సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో డిజైన్ రూపొందించారు. పాలక మండలి సభ్యులు నాగేశ్వరరావు మురళికృష్ణ వంటి దాతల సహాయంతో ఈ ఆలయం మరింత కొత్త హంగులను రూపుదిద్దుకోనుంది. అంతేకాకుండా గోగర్భం డ్యాం నుండి అంజనాద్రి వరకు వివిధ ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేందుకు వివిధ రాకాల పుష్పాలతో గార్డెన్స్‌ను టిటిడి ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు అంజనాద్రి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తుంది టిటిడి. మరో రెండేళ్ళలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కానున్నాయి.