మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 17 జులై 2017 (12:38 IST)

గోవా నుంచి దిగుమతి.. టీనేజీ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా... చైన్ సిస్టం ద్వారా సేల్స్

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న మత్తుమందు విక్రయాల కేసులో రోజుకో ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. ముఖ్యంగా.. విద్యాసంస్థల్లో చదివే టీనేజీ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా ప్రారంభించి అనతికాలంలోనే సిన

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న మత్తుమందు విక్రయాల కేసులో రోజుకో ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. ముఖ్యంగా.. విద్యాసంస్థల్లో చదివే టీనేజీ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా ప్రారంభించి అనతికాలంలోనే సినీ పరిశ్రమకు వ్యాపారాన్ని విస్తరించినట్లు ఈ కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు కెల్విన్ వెల్లడించినట్టు సమాచారం. 
 
ప్రధానంగా యువతను టార్గెట్‌గా చేసుకున్న అతను పెద్దపెద్ద విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు వాటిని విక్రయించినట్టు వినికిడి. సినీపరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు పరిచయమైన తర్వాతే తాను ఎక్కువ వ్యాపారం చేసినట్లు కెల్విన్ వివరించినట్లు సమాచారం. గోవా కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం సాగిందని, పెద్దమొత్తంలో ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ మాదకద్రవ్యాలను తెప్పించి సరఫరా చేశామని, డీహెచ్‌ఎల్, ఇండియా పోస్టు కొరియర్ సంస్థ ద్వారా గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్టు కెల్విన్ తెలిపినట్టు తెలుస్తోంది.
 
ముఖ్యంగా ఈ డ్రగ్స్ విక్రయాలను చైన్ సిస్టం ద్వారా కొనసాగించినట్టు, విద్యాసంస్థల ప్రాంగణాల వద్ద అడ్డాలను ఏర్పాటు చేసుకుని అమ్మకాలు సాగించినట్టు ప్రధాన నిందితుడు పేర్కొన్నట్టు తెలుస్తోంది. పేరు మోసిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల ద్వారా సినిమా పరిశ్రమతో సంబంధాలు ఏర్పరచుకుని, చైన్ సిస్టం ద్వారా దాదాపు 10 వేల మందిని వినియోగదారులుగా చేర్చుకున్నట్లు చెప్పాడట. నిత్యం అనేకరకాల ఒత్తిళ్లను ఎదుర్కొనే సినిమా రంగానికి డ్రగ్స్ సరఫరా చేయడం వల్లే ఎక్కువ సంపాదించినట్లు కెల్విన్ ఒప్పుకొన్నట్లు సమాచారం.
 
నాలుగేళ్లుగా సినిమారంగానికి సరఫరా జరుగుతున్నదని, డ్రగ్స్‌ను ప్రముఖుల డ్రైవర్ల ద్వారా సరఫరా చేసేవాళ్లమని, ప్రముఖులు మాత్రం తమ వద్దకు వచ్చే వారుకాదనీ, పెద్దపెద్ద పార్టీలకు, ఈవెంట్లకు మత్తు పదార్థాలను సరఫరా చేశామని, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ డ్రగ్స్‌ను గోవా నుంచి తెప్పించినట్లు సరఫరా చేసినట్టు పోలీసుల విచారణలో బట్టబయలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో గోవాలో ఎవరు ఇంతమొత్తంలో డ్రగ్స్ సరఫరా చేశారని సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.