మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (10:03 IST)

విశ్వాస పరీక్ష చెల్లదు... పళని సర్కారును స్పీకర్ గట్టెక్కించారు.. కోర్టుకెళితే మటాష్

తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సర్కారు ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష ఎట్టిపరిస్థితుల్లోనూ చెల్లదుగాక చెల్లదని పలువురు న్యాయ నిపుణులతో పాటు మాజీ స్పీకర్లు అభిప్రాయపడ

తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సర్కారు ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష ఎట్టిపరిస్థితుల్లోనూ చెల్లదుగాక చెల్లదని పలువురు న్యాయ నిపుణులతో పాటు మాజీ స్పీకర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విశ్వాస పరీక్షపై విపక్ష సభ్యులు ఎవరైనా కోర్టుకెళితే ఖచ్చితంగా బలపరీక్ష చెల్లదని కోర్టు ప్రకటించి తీరుతుందని వారు చెపుతున్నారు. 
 
గత శనివారం సీఎం పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో సభలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. సభలో మైకులు, కుర్చీలు, టేబుల్స్ ధ్వంసం, సభాపతిపై విపక్ష సభ్యుల దాడి, ఆ తర్వాత సభ నుంచి విపక్ష సభ్యుల గెంటివేత వంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. విపక్ష సభ్యులను బయటకు పంపించి స్పీకర్ విశ్వాస పరీక్షను పూర్తి చేశారు. దీనిపై కోర్టుకు వెళితే అది రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. 
 
సభ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఉదయం 11 గంటలకు విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టారని, కానీ, అర్థాంతరంగా సభ వాయిదా పడిందని, ఆ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి మరోమారు విశ్వాసతీర్మానం ప్రతిపాదించారని, ఇలా కీలకమైన ఓటింగ్‌ కోసం స్వల్ప సమయంలో రెండు మార్లు ప్రతిపాదించడం కూడా సభానిబంధనలకు విరుద్ధమన్నారు.
 
అధికార పార్టీ తర్వాత అత్యధిక ఎమ్మెల్యేలున్న డీఎంకే, రహస్య ఓటింగ్ జరపాలన్న డిమాండ్‌ను తెరపైకి తేగా, దాన్ని స్పీకర్ ధనపాల్ పట్టించుకోలేదని తమిళ అసెంబ్లీ మాజీ స్పీకర్లు సేడపట్టి ముత్తయ్య, ఆవుడయప్పన్, మాజీ డిప్యూటీ స్పీకర్‌ వీపీ దురైసామిలు అంటున్నారు. సభలో జరిగిన ఘటనలు నియమాలకు వ్యతిరేకమేనని, స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారని వారు అభిప్రాయపడ్డారు. 
 
కువత్తూరులో ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో అసెంబ్లీలోనూ అలానే ఉన్నారని, అంతమాత్రాన రిసార్టులోనే బల నిరూపణ పూర్తి చేయాల్సిందని ముత్తయ్య ఎద్దేవా చేశారు. బలపరీక్షను రద్దు చేసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, అధికార పక్షానికి వెన్నుదన్నుగా స్పీకర్ నిలవడం ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చన్నారు. 
 
ఈ పరీక్ష చట్ట విరుద్ధమని, స్పీకర్ తీర్పును కోర్టులో సవాల్ చేస్తే, అది రద్దయ్యే అవకాశాలే అధికమని మాజీ ఉప సభాపతి వీపీ దురైసామి వ్యాఖ్యానించారు. స్పీకర్ సభలో లేని వేళ, మార్షల్స్ ఎలా లోపలికి రాగలిగారని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఎడప్పాడిని గండం నుంచి గట్టెక్కించాలనే ఆరాటంతోనే స్పీకర్‌ ధనపాల్‌ ఆద్యంతమూ పక్షపాతంగానే వ్యవహరించారని వారు ఆరోపించారు.