1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (03:10 IST)

'విప్లవనాయకి' నుంచి 'అమ్మ'గా జయలలిత ప్రస్థానం ఎలా సాగిందంటే...

పురట్చితలైవి (విప్లవనాయకి)గా పేరొందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ ప్రస్థానం ముళ్లబాటలో కొనసాగిందని చెప్పాలి. అన్నాడీఎంకేలో ప్రవేశించిన ఆరంభంలోనే ఆమె అనేక చీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయి

పురట్చితలైవి (విప్లవనాయకి)గా పేరొందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ ప్రస్థానం ముళ్లబాటలో కొనసాగిందని చెప్పాలి. అన్నాడీఎంకేలో ప్రవేశించిన ఆరంభంలోనే ఆమె అనేక చీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగి.. జయలలిత అంటే అన్నాడీఎంకే.. అన్నాడీఎంకే అంటే జయలలిత అనే విధంగా మారిపోయారు. పార్టీలో చేరిన ఆరంభంలో జయలలితను పురట్చితలైవి అని పిలిచేవారు.. ఇపుడ అదే పార్టీ నేతలు తమ కన్నతల్లిగా భావిస్తారు. అలా విప్లవనాయకిగా ఖ్యాతిచెందిన జయలలిత అమ్మగా పేరుపొందడం వరకూ ఆమె ప్రస్థానం ఎలా సాగిందంటే... 
 
తమిళ సినీరంగంలో ఎంజీఆర్‌ (ఎంజీరామచంద్రన్)ది విశిష్టమైన స్థానం. దీనిగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే అధినేత కరుణానిధి నుంచి వేరుపడి.. అన్నాడీఎంకేను స్థాపించారు. కేవలం పేద ప్రజలకు సేవ చేయాలన్న పెద్ద మనసుతో ఈ పార్టీని నెలకొల్పారు. ఆ తర్వాత పేదల కోసం అనేక వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి, వాటిని విజయవంతంగా అమలు చేశారు.
 
అందుకనే ఆయనను పురట్చితలైవర్‌ (విప్లవ నాయకుడు) అని పిలుచుకునేవారు. ఆయన సాన్నిహిత్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన జయలలిత అదే స్ఫూర్తితో ఉండటంతో పురట్చితలైవిగా తమిళులు పిలవడం ప్రారంభించారు. ఒక సమయంలో అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులైన డీఎంకేకు చెందిన వారు దాడి చేయడంతో ఆమె ఆగ్రహోదగ్రులయ్యారు. డీఎంకేను గద్దె నుంచి దింపేవరకు సభలో అడుగుపెట్టనని శపథం చేశారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. 
 
2011లో తిరిగి అధికారంలో వచ్చిన సమయంలో జయలలిత వైఖరిలో మార్పు వచ్చింది. రాజకీయప్రత్యర్థులను అణచివేయడం కంటే పేదప్రజలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశ పెట్టడంపై దృష్టిసారించారు. నిత్యం సరికొత్త ప్రజా సంక్షేమ పథకాలకు రూప కల్పన చేసేవారు. సామాన్యుల కష్టాలకు స్పందించేవారు. తమిళ రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన ఎక్కువగా వుండేది. వీటిని అధిగమించి తొలిసారిగా ప్రజలకు సన్నిహితమయ్యారు. 
 
రూపాయికే ఇడ్లీ పథకం నుంచి అమ్మ ఫార్మసీ వరకు పదుల సంఖ్యలో ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి సగటు తమిళుల హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించారు. శాంతి భద్రతల విషయంలోనూ ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించేవారు కాదు. శ్రీలంక నావికాదళం తమిళ జాలర్లపై కొనసాగించే దాడులు జరిగినా.. అంతర్జాతీయంగా తమిళ సమాజానికి ఎలాంటి ఇబ్బందులు వాటిల్లినా ఏ మాత్రం ఉపేక్షించేవారు కాదు. తమిళనాడు ప్రజల సంక్షేమానికి, అభ్యుదయానికి తుదిశ్వాస వరకు కృషిచేశారు. అందుకే తమిళనాడు ప్రజలకు అమ్మ అంటే అంత గౌరవం, అభిమానం, ప్రేమ, అనురాగం.