ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (16:53 IST)

వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఫలితం ఏమిటి..? నిత్య సుమంగళీ ప్రాప్తి కోసం..?

శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు రోజు శుక్రవారం "వరలక్ష్మీ వ్రతం"ను జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని సర్వమంగళ ప్రాప్తి కోసం, సంతానం, అష్టైశ్వర్యాల కోసం ప్రార్థించాలి. ''నిత్య

శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు రోజు శుక్రవారం "వరలక్ష్మీ వ్రతం"ను జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని సర్వమంగళ ప్రాప్తి కోసం, సంతానం, అష్టైశ్వర్యాల కోసం ప్రార్థించాలి. ''నిత్య సుమంగళి''గా ఉండాలని కోరుతూ మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. తమభర్త ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాంతం అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలనీ స్త్రీలు ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటారు. 
 
పూర్వం స్త్రీలకు సర్వసౌభాగ్యాలను, పుత్ర పౌత్రాదులను, సుఖ జీవితాన్ని ప్రసాదించే వ్రతం ఏదని పరమేశ్వరుడిని పార్వతి అడిగినప్పడు ఆ దేవదేవుడు "వరలక్ష్మీ వ్రతాన్ని" వివరిస్తాడు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు దీనిని చేయాలి. ఈ సందర్బంలోనే మహాశివుడు పార్వతీదేవికి చారుమతిదేవి కథను వివరిస్తాడు.
 
మగధ దేశంలో కుండినంబు అనే ఒక పట్టణం ఉంది. అక్కడ బంగారు ప్రాకారాలు, బంగారు గోడలతో నిర్మితమైన ఇళ్ళుంటాయి. ఆ పట్టణంలోనే ''చారుమతి" అనే ఒక స్త్రీ ఉంది. ఆ వనితామణి రోజూ ఉషఃకాలంలోనే మేల్కొని, స్నానం చేసి, పెద్దలకు అనేక విధాల ఉపచారాలు జేసి, ఇంటి పనులను జేసుకొనేది. ఆమెకు ఈ వ్రతం ఆచరించడం ద్వారా మహాలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. 
 
ఒకనాడు లక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించి, ''శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానని" అంటుంది. తర్వాత భర్త, మామ మొదలయిన వాళ్లకు స్వప్నవృత్తాంతం చెప్పి, వ్రతాన్ని ఆచరిస్తుంది. అలా చారుమతితోపాటు ఇతర స్త్రీలంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ సకలసంపదలు పొందినట్లు పెద్దలు చెప్తుంటారు. 
 
అనేకానేక వరాలను కురిపించే వరలక్ష్మిని శ్రావణమాసంలోని ఈ పవిత్ర శుక్రవారం రోజున అనంతమైన భక్తితో పూజించిన వారి జన్మ ధన్యమైనట్లే. వరలక్ష్మీ వ్రతం  రోజున మహిళలు వేకువ జామునే లేచి.. ఇంటిని శుభ్రపరుచుకుని.. గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కడతారు. స్నానాదులను ముగించి, కొత్త వస్త్రాలు ధరించి, పుష్పాక్షతలచే దేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజకు స్థాపించే ప్రదేశంలో పిండితో నేలపై గోమాత పాదాలు, పద్మాన్ని వేస్తారు. 
 
బంగారు, వెండి మరేదైనా లోహపు కలశానికి పసుపు రాసి, గంధం పూసి, ఆపై కుంకుమ బొట్టు పెడతారు. కలశాన్ని నీటితో నింపుతారు. దానిలో మామిడి ఆకులు, అక్షతలు ఉంచి, పైన కొబ్బరికాయను పెట్టి పిండితో వేసిన పద్మంలో కొత్త రవికెల గుడ్డను పరుస్తారు. ఆ వస్త్రంపై బియ్యం పోసి, దానిపై కలశాన్ని స్థాపిస్తారు. కొందరు వరలక్ష్మీ దేవిని కొబ్బరికాయకు పసుపు రాసి, పిండితో ముక్కుచెవులను చేసి, కాటుకతో కళ్ళను దిద్ది, బొట్టు పెట్టి కలశంలో దేవి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఈ విగ్రహాన్ని బంగారు లేదా వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. 
 
అలాగే, మరి కొందరు కొబ్బరికాయకు బంగారు లేదా వెండి ముఖాన్ని అమర్చి శుభ్రమైన పూలు, ఆభరణాలతో దేవిని అలంకరిస్తారు. ముందుగా విఘ్ననాయకుడైన వినాయకుని పూజించి, తరువాత వరలక్ష్మీదేవిని ఆహ్వానించి, సకలోపచారాలతో పూజిస్తారు. తొమ్మిది పోసలు వేసి తొమ్మిది సంఖ్యలో దేవిని పూజిస్తారు. 
 
ఆ దేవి రక్షాబంధనంగా తమ ఎడమ చేతికి దానిని కట్టుకుంటారు. లక్ష్మీ అష్టోత్తర శత నామాలతో దేవిని పూజించి తొమ్మిది రకాలైన పిండి వంటలతో మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ రోజు ఇళ్లన్నీ ఆధ్యాత్మిక కళతో అలరారుతాయి. ఇంటిల్లిపాదీ షడ్రసోపేతాలతో భోజనాలు చేస్తారు. పెళ్లయిన మహిళలు పూజ తర్వాత ముతైదువులకు తాంబూలాదులు ఇచ్చి, వారి దీవెనలు అందుకుంటారు. మంగళహారతి గీతాలను పాడి వరలక్ష్మీ కృపను కోరుకుంటారు.