యువత పాటించాల్సిన ఆహార నియమాలు
ఎప్పుడు, ఏది, ఎలా తినాలి ?ప్రతి ప్రాణి ఆహారం తీసుకోక తప్పదు. అలాంటిది మనిషి మూడు పూటలా భోజనం చేయాల్సిందే. ఇందులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ లేదా సప్పర్. ఏదైనా కావచ్చు. మనిషి తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా శరీరంలోని మెదడు తదితర భాగాలకు పోషణనందిస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ మనసు, ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు తీసుకునే ఆహారంలో నూనె, మసాలా దినుసులు, పాచిపోయిన ఆహారం లేదా హెవీ డైట్ కారణంగా మనసులో కామ, క్రోధాలు, ఒత్తిడి తదితరాలు పెరిగిపోతాయి. ఆకలికి మించి ఎక్కువగా తీసుకోవడం, లేదా తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు వైద్యులు. ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి అందడంతోపాటు ఉత్సాహంగాను ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్లనే శరీరానికి శక్తి, బలం వస్తుందనుకోవడం పొరబాటు, మీరు తీసుకున్న ఆహారం ఏ మేరకు జీర్ణమయ్యిందనేది తెలుసుకోవాలి. పనుల ఒత్తిడి కారణంగా ప్రస్తుతం యువత తమ శరీరానికి కావలసి సరైన ఆహారాన్ని తీసుకోవడం లేదనేది నూటికి నూరుపాళ్ళు నిజం. సమయానికి ఆకలి తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా దారిలో ఏది కనపడితే అది తినేయడం లేదా టీ-స్నాక్స్‌తోను తమ ఓ పూట గడిచిందనుకుంటుంటారు. దీంతో వారు తీసుకునే ఆహారం జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. మీరు తీసుకున్న ఆహారం సరైనపద్ధతిలో జీర్ణమయ్యేందుకు తీసుకోవాల్సిన కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.ఆహారం ఎప్పుడు తీసుకోవాలి ?రష్యాలో ఓ సామెత ఉంది. అదేంటంటే అల్పాహారాన్ని నీవే స్వయంగా తిను. మధ్యాహ్నపు భోజనాన్ని మీ స్నేహితునితో పంచుకో, రాత్రిపూట నీవు తీసుకునే ఆహారాన్ని నీ శత్రువుకు ఇవ్వు అని. అంటే ప్రతి ఒక్కరు ఉదయంపూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. వాస్తవానికి ఉదయం 10 నుంచి 11 మధ్యలో భోజనం తీసుకోవాలి. దీంతో పగలంతా పనిచేసేందుకు శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
కొందరేమో ఉదయంపూట టీ-అల్పాహారం తీసుకుంటుంటారు. తర్వాత ఏకంగా రాత్రి పూట భోజనం తీసుకుంటారు. దీంతో ఆరోగ్యం పాడవుతుంది. పగటిపూట మీరు తీసుకునే ఆహారం శారీరక శ్రమననుసరించి ఉండాలి. రాత్రిపూట తీసుకునే ఆహారం (డిన్నర్) తేలికపాటి భోజనం లేదా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలంటున్నారు వైద్యులు. మీరు తీసుకునే కొద్దిపాటి ఆహారమైనా కూడా సమయానుసారం తీసుకుంటుండాలి. దీంతో మీ శరీరంలోని జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ?ప్రతి రోజు ఆహారాన్ని తీసుకునే ముందు చేతులు, కాళ్ళు, నోరు శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా దక్షిణ దిక్కును చూస్తున్నట్లు కూర్చోండి. దీంతో మీ ఆయుష్షు, కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చెప్పులు తొడుక్కొని, నిలబడి ఆహారాన్ని భుజించకూడదంటున్నాయి శాస్త్రాలు. భోజనాన్ని బాగా నమిలి తినాలి. లేకుంటే దంతాలు చేయాల్సిన పనిని ప్రేగులు చేయాల్సి వస్తుంది. అంటే దంతాలుండేది కేవలం మీరు తీసుకునే ఆహారాన్ని నమిలి, గ్రైండ్ చేసేందుకేనన్న విషయం గుర్తుంచుకోవాలి. భోజనం తీసుకునే సమయంలో మాట్లాడకుండా ఉండాలి. దీంతో మీరు తీసుకునే భోజనం మీ నోట్లో ఊరిన లాలాజలంతో కలిసి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. టీవీ చూస్తూ లేదా వార్తాపత్రిక చదువుతూ ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోను భుజించకూడదు. రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం మీరు భుజించాలి తప్ప ఆహారం చాలా రుచిగా ఉందని ఏకంగా ఎక్కువ లాగించేస్తే తర్వాత దుష్పరిణామాలు తప్పవంటున్నారు వైద్యులు. భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.భోజనం చేసిన తర్వాత ఏమేమి చేయకూడదు ?
భోజనం చేసిన తర్వాత వెంటనే నీళ్ళు లేదా టీ సేవించరాదు. భోజనం చేసిన తర్వాత గుర్రపు స్వారీ, పరుగెత్తడం, కూర్చోవడం, నిద్రకుపక్రమించడం చేయరాదు. భోజనం చేసిన తర్వాత కాసేపు అటూ ఇటూ తిరగడం ఆరోగ్యానికి ఆనందదాయకం.
భోజనం చేసిన తర్వాత ఏమేమి చేయాలి ?
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అటూ- ఇటూ తిరుగాడటం, రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కనీసం వంద అడుగులు నడవాలి. తర్వాత నిద్రకుపక్రమించే ముందు ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి లేదా వజ్రాసనం వేసుకుని కూర్చుంటే మీరు తీసుకున్న భోజనం సాఫీగా జీర్ణమౌతుంది. భోజనం తీసుకున్న ఓ గంట తర్వాత తియ్యటి పాలను లేదా పండ్లను సేవించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఏమేమి తీసుకోకూడదు ?
రాత్రిపూట పెరుగు, నువ్వులు, ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. పాలతోపాటు ఉప్పు, పెరుగు, పుల్లటి పదార్థాలు, చేపలు, పనసకాయలను తీసుకోకూడదు. అలాగే నెయ్యితోపాటు తేనెను సమపాళ్ళలో సేవించకూడదు. పాలతో చేసిన పాయసంతోపాటు ఖిచడీని కూడా సేవించకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.