శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ఆకలి కోసమో, శరీర పోషణ కోసమో లేదా ఆహ్లాదం కోసమో తీసుకునే ఆహార పానీయాలు ఏవైనా జీర్ణాశయం గుండా కాలేయానికి చేరాల్సిందే. అవన్నీ రక్తప్రసరణతో కలిసి కాలేయం నుంచి పయనించాల్సిందే. మనం తీసుకునే పోషకాల్లోని హానికారక పదార్థాలన్నింటినీ వడబోసే కీలక బాధ్యతను కాలేయం నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ అంత సులభమైనదేమీ కాదు. ఈ భారం మరీ అధికమైనప్పుడు ఒక్కోసారి కాలేయం దెబ్బతినే ప్రమాదం ఏర్పడవచ్చు. ఇలా దెబ్బతినే పరిణామాల వెనుక డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు కొనుక్కుని వేసుకునే అలవాటొకటి ప్రధాన కారణంగా ఉంటోంది.
ముఖ్యంగా ఓటిసి (ఓవర్- ద- కౌంటర్) డ్రగ్స్, హెర్బల్, పాల ఉత్పత్తులకు సంబంధించినవి కాలేయాన్ని దెబ్బ తీస్తున్నాయి. కొందరిలో ఇది ప్రాణాపాయానికే దారి తీయవచ్చు. ఏళ్లపర్యంతంగా మందులు వాడే వారిలో కూడా డి.ఐ.ఎల్.ఐ (డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజ్యురీ) అంటే మందుల వల్ల కాలేయం దెబ్బతినే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటోంది. దాదాపు వెయ్యిరకాల మందులు, సప్లిమెంట్లు వంటి వ్యర్థాలతో కాలేయం నిండిపోయి హైపటోటాక్సిసిటీకి కారణమవుతున్నట్లు పలు అధ్యయనాల్లో స్పష్టమయ్యింది. కాకపోతే ఒకసారి ఆ మందులు మానేస్తే దెబ్బ తిన్న కాలేయం తిరిగి చక్కబడే అవకాశం ఉంది.
• పెద్ద వయసులో....
మిగతా వారితో పోలిస్తే వయసు పైబడిన వారిలో ఈ సమస్య రెండురెట్లు అధికంగా ఉంటోంది. అందుకే తాము వేసుకునే మందుల దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అంతకన్నా ముందు ఓటిసి మందులు వేసుకునే అలవాటు నుంచి బయటపడాలి. వృద్ధాప్య దశలో మందుల్ని జీర్ణించుకునే శక్తి బాగా తక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో వారు మోతాదును మించి మందులు వేసుకుంటే కాలేయ వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు కాంబినేషన్‌లో ఒకేసారి పలురకాల మందుల్ని వేసుకుంటున్నప్పుడు కాలేయం పాడయ్యే అవకాశాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయి.
పురుషుల కన్నా స్త్రీలే ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజ్యురీ బారిన పడే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో బయటపడింది. వారసత్వకారణాలు, పోషకలోపాలు, అతిగా మద్యం సేవించడం, మధుమేహం, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, స్థూలకాయం, కాలేయంలో ఉండే వ్యాధులు కూడా మలినాల్ని శుద్ధి చేసే శక్తిని దెబ్బ తీస్తాయి. కాలేయ వ్యాధికి కారణమవుతాయి.
• మందులు అతిగా వాడి...
కొన్ని రకాల మందుల్ని అతిగా వాడటం వల్ల వచ్చే దుష్పరిణామాలను ఇంట్రిన్సిక్ రియాక్షన్స్ అంటారు. ఉదాహరణకు పారసెట్మాల్ మాత్రలు చాలా సురక్షితమైనవి అన్న ప్రచారముంది. కానీ ఎక్కువ మోతాదులో వేసుకుంటే అవి కూడా కాలేయాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ మంది తరచూ వాడే పెయిన్ కిల్లర్లు ఉదాహరణకు క్రోసిన్, కాంబిఫ్లామ్, సినరెస్ట్ మాత్రల్ని అతిగా వాడినా ఈ కాలేయ సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వాస్తవానికి పారసెట్మాల్ ఒక మోతాదుకు వెయ్యి మిల్లీగ్రాములకు మించకూడదు. ఆ మేరకు కొద్ది రోజుల పాటు రోజుకు నాలుగు గ్రాములకు మించకుండా తీసుకోవాలి. పారసెట్మాల్ అతి వినియోగం వల్ల ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వైద్యం కోసం యాంటీఆక్సిండెంట్ ఎ-అసిటైల్‌సిస్టీన్ అనే మందుల్ని ఇస్తుంటారు. అయితే ఇంకా కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు ఎలా ఉంటాయన్నది చాలా పరిశోధనల తర్వాత కూడా స్పష్టం కాలేదు.
ఇలా తెలియని విషయాలను ‘ఇడియోసింక్రాటిక్’ అంటారు. కాకపోతే కాలేయం మిగతా శరీర భాగాల్లా కాకుండా వేరుగా స్పందించడాన్ని బట్టి కొన్నిసార్లు సమస్యను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. నిజానికి ఈ ఇడియో సింక్రాటిక్ పరిణామాలు చాలా అరుదుగానే కనపడతాయి. చాలా మందిలో ఈ దుష్ప్రభావాలు మన దృష్టికి అందడానికి దాదాపు ఆరుమాసాల వరకు పడుతుంది. కాకపోతే ఆ కాల వ్యవధి వ్యక్తివ్యక్తికీ వేరుగా ఉంటుంది.
ఏమైనా ఇంట్రిన్సిక్ రియాక్షన్స్‌తో పోలిస్తే, ఇడియోసింక్రాటిక్ రియాక్షన్స్ చాలా తక్కువగానే కనిపిస్తాయి. ఈ రియాక్షన్స్‌ను గుర్తించడం కష్టమే కాకుండా ఒక్కోసారి హెపటైటిస్ వంటి ఇతర కాలేయ వ్యాధులుగా పొరబడే ప్రమాదం ఉంది. మార్కెట్‌లోకి రావడానికి ముందు ఇండియన్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆధ్వర్యంలో పరీక్షించబడిన మందుల్లో కూడా కొన్ని ఇప్పటికీ హానికారకంగా పనిచేస్తూనే ఉన్నాయి.
మరికొన్ని ఇతర మందులు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. వాటిలో యాంటిబయాటిక్స్ ఒకటి.
యాంటీబయాటిక్స్
యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్ కాంబినేషన్స్‌లో కొన్ని ఇడియోసింక్రాటిక్ రియాక్షన్స్‌తో ముడిపడి ఉన్నాయి. అయితే ఈ సమస్య ఇవి కొన్ని మందులకే పరిమితం కాలేదు. ఇవికాక ఇతరంగా చాలా మందులు ఉన్నాయి.
మెథోట్రెక్సేట్
రుమటాయిడ్ ఆర్థరైటిస్, సొరియాసిస్, మెథోట్రెక్సేట్‌లు కొంతమందిలో ఆశించిన దానికి విరుద్ధంగా కాలేయం మీద పనిచేస్తాయి. అయితే ఫోలిక్ ఆసిడ్ సప్లిమెంట్లు కూడా హెపటోటాక్సిసిటీ సమస్యను అరికట్టగలుగుతాయి.
డిసియోఫెనేక్
ఈ నాన్‌స్టెరాయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ మందులు రుమటాయిడ్ వైద్యంలో వాడతారు కానీ ఈ మందులో కాలేయాన్ని దెబ్బతీసే అంశాలు కూడా ఉన్నట్లు వెల్లడయ్యింది.
ఫ్లేవోకాక్సిడ్
ఆస్టియోఆర్థరైటిస్ వైద్యం కోసం వాడే ఈ మందుల విషయంలో 57 నుంచి 68 ఏళ్ల వయసున్న స్త్రీల మీద జరిపిన అధ్యయనంలో కొంతమంది కాలేయ సమస్యలకు లోనైనట్లు బయటపడింది. కాకపోతే ఆ మందులు వాడటాన్ని ఆపేసిన కొద్ది రోజులకే కాలేయం మళ్లీ చక్కబడటం కనిపించింది.
ఇసోనియాజిడ్
క్షయవ్యాధి చికిత్సలో ఇచ్చే ఈ మందు వినియోగం వల్ల కాలేయ రసాలు 20 శాతం పెరిగాయి. హెపటోటాక్సిసిటీ 2 శాతం పెరిగింది. దీనికి తోడు వీరికి మద్యం తీసుకునే అలవాటు కూడా ఉంటే లివర్ టాక్సిసిటీ మరిం త పెరిగే అవకాశాలు ఏర్పడతాయి.
విటమిన్-ఎ, ఐరన్
అధికమొత్తంలో ఎ- విటమిన్, ఐరన్‌లను తీసుకుంటే లివర్ పనితనం దెబ్బ తినే ప్రమాదం ఉంది.
స్టాటిన్స్
అరుదుగానే అయినా ఈ మందుల వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మందులు వాడటానికి ముందు డాక్టర్ అవసరమైన అన్ని పరీక్షలు చేసే మందులు సూచిస్తారు. అయితే డాక్టర్‌ను కలవకుండానే కొందరు ఈ మందులు వేసుకుని కష్టాల్లో పడతారు.
అనబాలిక్ స్టెరాయిడ్స్
వీటిని ఎక్కువగా బాడీ బిల్డర్స్ వాడతారు. అయితే చాలామంది గమనించని విషయం ఏమిటంటే వీటిలో కాలేయాన్ని దెబ్బ తీసే తత్వం కూడా ఉంది.
• కాపాడుకోవడం ఎలా?
ఈ కింది జాగ్రత్తలు పాటించడం ద్వారా కాలేయ సమస్యల్ని చాలా వరకు నిరోధించవచ్చు.
మనం తీసుకునే మందుల పట్టికను ఎప్పుడూ భద్రపరిచి ఉంచాలి.
*మీరు తీసుకునే మాత్రల గురించిన వివరాలు మీ జనరల్ ప్రాక్టీషనర్‌కు, స్పెషలిస్టుకు, కెమిస్ట్‌కు ఎప్పటికప్పుడు తెలియచేయాలి. దానివల్ల మీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో వారు శ్రద్ధ వహిస్తారు.
*మీరు తీసుకునే మాత్రల గురించిన వివరాల కోసం ఓటిసి సూచనలను పూర్తిగా చదవాలి. వారి నిర్దేశాలను ఎప్పుడూ మించి పోకూడదు.
*మల్టిపుల్ ఓటిసి లేదా ప్రిస్ర్కిప్షన్ మందులు తీసుకుంటున్నప్పుడు ఆ మందుల్లో ఏఏ పదార్థాలు ఉన్నాయో చదవాలి. దానివల్ల ఆయా పదార్థాల మోతాదు పెరిగే ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు.
*కాలేయ సంబంధితమైన సమస్య ఉన్నవారు మాత్రల్ని, సప్లిమెంట్లను కొత్తగా వేసుకోబోయే ప్రతిసారీ డాక్టర్ సలహా తీసుకోవాలి.
*డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ డిసీజ్ ఏదైనా ఉంటే అందుకు అవసరమైన అన్ని పరీక్షలూ చేయించుకుని, డాక్టర్ సూచించిన మందుల్ని సూచించిన మోతాదులో వేసుకోవాలి. డాక్టర్ ఆ మందులు మానేయమని చెప్పేదాకా కొనసాగించాలి. తమకు తామే మోతాదు మించి వేసుకోవడం, మధ్యలో మానేయడం గానీ చేయకూడదు.
వయసు పైబడినవారిలో ఈ సమస్య రెండురెట్లు అధికంగా ఉంటోంది. అందుకే తాము వేసుకునే మందుల దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అంతకన్నా ముందు ఓటిసి మందులు వేసుకునే అలవాటు నుంచి బయటపడాలి. వృద్ధాప్య దశలో మందుల్ని జీర్ణించుకునే శక్తి బాగా తక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో వారు మోతాదును మించి మందులు వేసుకుంటే కాలేయ వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.