గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 22 జూన్ 2019 (15:40 IST)

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల ఏమవుతుంది?

వయసును బట్టి మూత్రశయం పనితీరు మారుతూ ఉంటుంది. మూత్రశయ కణజాలం సాగే గుణం తగ్గిపోవటం వల్ల మునపటిలా మూత్రాన్ని ఆపుకోవటం సాధ్యం కాకపోవచ్చు. దీంతో చాలాసార్లు బాత్రూమ్‌కి వెళ్లాల్సి రావచ్చు. మూత్రశయగోడ, కటి కండరాలు బలహీనం కావటం వల్ల విసర్జన అనంతరం ఇంకా కొంత మూత్రం లోపలే ఉన్నట్టు అనిపించవచ్చు. బొట్లు బొట్లుగా మూత్రం లీక్ కావచ్చు. ఇలా మూత్రశయాన్ని దెబ్బతీసే అన్ని అంశాలను మనం నియంత్రించలేకపోయినా కొన్ని జాగ్రత్తలతో వీటి ఆరోగ్యం సజావుగా ఉండేటట్లు చూసుకోవచ్చు.
 
1. మద్యం, కాఫీ, టీ వంటి పానీయాలు ఒంట్లో నీటి శాతం తగ్గేలా చేస్తాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. అలాగే బీడీలు, సిగరెట్టు వంటివి తాగే అలవాటుంటే వెంటనే మానేయాలి.
 
2. మూత్రాశయ ఆరోగ్యానికి నీరు ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల రోజూ తీసుకునే ద్రవాల్లో కనీసం సగం వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. రోజుకు 6-8 గ్లాసుల నీరు తాగటం మంచిది. అయితే కిడ్నీ వైఫల్యం, గుండె జబ్బు గలవారు మాత్రం డాక్టర్ సూచనల మేరకే నీరు తాగాలి.
 
3. స్త్రీలు-పురుషులు సంభోగంలో పాల్గొన్న కొంతసేపటి తర్వాత మూత్ర విసర్జన చేయటం మంచిది. దీంతో సంభోగ సమయంలో మూత్రమార్గంలోకి ఏదైన బ్యాక్టీరియా ప్రవేశిస్తే బయటకు వెళ్లిపోతుంది.
 
4. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల మూత్రశయ కండరాలు బలహీనమవుతాయి. ఇన్‌ఫెక్షన్లు తలెత్తే అవకాశము పెరుగుతుంది. కాబట్టి కనీసం 3-4 గంటలకు ఒకసారైనా మూత్రవిసర్జన చేయాలి. అలాగే కాస్త సమయం పట్టినా పూర్తిగా మూత్ర విసజర్జన అయ్యేలా చూసుకోవాలి. మూత్రం పోసేటప్పుడు కండరాలు వదులుగా ఉండేలా చూసుకుంటే సాఫీగా విసర్జన అవుతుంది.
 
5. వదులైన కాటన్ లోదుస్తులు ధరిస్తే మూత్రమార్గం చుట్టుపక్కల భాగాలు పొడిగా ఉంటాయి. అదే బిగుతుగా ఉండే జీన్స్ నైలాన్‌ లోదుస్తులతో తేమ అలాగే ఉండిపోయి అక్కడ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.