శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 28 మే 2019 (21:32 IST)

బెల్లంతో అద్వితీయమైన అందం... చిట్కాలు

ముఖచర్మం కాంతివంతంగా ఉండడానికి అనేక రకములైన క్రీంలు, కాస్మోటిక్స్ వాడుతుంటాము. దానివల్ల చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా మన ప్రకృతిలో లభించే కొన్ని పదార్దాలతో మన ముఖ చర్మం యొక్క అందాన్ని ఇనుమడింపచేసుకోవచ్చు. అలాంటి పదార్దాలలో బెల్లం ఒకటి. ఇది చర్మ కాంతిని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. 

ఇందులో పోషకాలు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉండటం చేత ఫ్రీ ర్యాడికల్స్ పైన పోరాడి ఏజింగ్‌ని వాయిదా వేసే సామర్థ్యం బెల్లంలో సమృద్ధిగా ఉంది. ఇది డార్క్ స్పాట్స్ మరియు బ్లేమిషెస్‌ను తగ్గించేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది. బెల్లంతో అందాన్ని పెంచుకునే చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం.
 
1. బెల్లంలో లభించే గ్లైకోలిక్ యాసిడ్ అనేది చర్మ కాంతిని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనే, కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకోవాలి. బెల్లాన్ని మెత్తటి పొడిగా చేసుకోవాలి. అందులో తేనె, అలాగే నిమ్మరసాన్ని జోడించాలి. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలపాలి. ఈ పేస్టును ముఖం, అలాగే మెడపై అప్లై చేయాలి. ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ ప్యాక్‌ను అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగివేయాలి.
 
2. బెల్లం మొండి మొటిమల నుంచి ఉపశమనాన్నిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించాలి. అలాగే నిమ్మరసం బదులు కొన్ని చుక్కల నీళ్లను కూడా జోడించవచ్చు. ఈ ప్యాక్‌ను మొటిమలు ఉన్న ప్రాంతంపై అప్లై చేయాలి. కొద్ది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ చిట్కాను ప్రతి రోజూ పాటిస్తే వేగవంతమైన ఫలితాలను పొందవచ్చు.
 
3. బెల్లంలో లభించే గ్లైకోలిక్ యాసిడ్ అనేది చర్మం ఎలాస్టిసిటీను పెంపొందిస్తుంది. తద్వారా ఫైన్ లైన్స్ మరియు ముడతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక పాత్రలో టీస్పూన్ బెల్లం పొడి, టీస్పూన్ బ్లాక్ టీ టీస్పూన్ ద్రాక్ష రసం, చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్ వాటర్‌ని తీసుకోవాలి. వీటన్నిటినీ స్మూత్ పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ ప్యాక్‌ను ముఖంపై అప్లై చేసుకుని 20 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మంపై వచ్చే ముడతలు నివారించబడతాయి.