మంగళవారం, 3 ఫిబ్రవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (10:26 IST)

రేపటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. అన్ని ఏర్పాట్లు సిద్ధం

తిరుమల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. తిరుమలకు సుందరంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలు  బుధవారం ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల కంటే ముందుగా జరిగే అంకురార్పణ కార్యక్రమం మంగళవారం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు సంబంధించి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తుల కోసం తితిదే విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 
 
నాలుగు మాడ వీధులలో తొమ్మిది రోజలపాటు జరిగే బ్రహ్మోత్సవ ఏర్పాట్లును తితిదే ఈవో సాంబశివరావు, రాయలసీమ ఐజీ వేణుగోపాలకృష్ణ, డీఐజీ సత్యనారాయణ, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, కలెక్టరు సిద్ధార్థ్‌జైన్‌, ఎస్పీ గోపీనాథ్‌జెట్టి సోమవారం పరిశీలించారు. శాఖలు ఏవిధంగా సమన్వయంగా ఉండాలో చర్చించారు. 
 
ప్రోటోకాల్‌ ప్రముఖులకు మినహా ఇతరులకు వీఐపీ దర్శనం టిక్కెట్లను రద్దు చేశారు. రవాణా సమస్యలు తలెత్తకుండా 400 బస్సులు తిరిగే విధంగా ఆర్టీసీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గరుడసేవ రోజున తిరుమల, తిరుపతి మధ్య బస్సుల సంఖ్య 512 పెంచనున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకుని శ్రీవారి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. గురువారం ఉదయం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు.