సాధారణ భక్తులకు అసౌకర్యం కలుగరాదు... సిఎం ఆదేశం
తిరుమలకు వచ్చే ఏ ఒక్క సాధారణ భక్తునికి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆధారపడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఎక్కడా ఎటువంటి కష్టం రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి.
గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. పద్మావతీ అతిథి గృహంలో విడిది చేశారు. అనంతరం అధికారులతో కలసి టిటిడిపై సమీక్ష నిర్వహించారు. అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎందరు విఐపిలు ఉన్నా సామాన్య భక్తులను మాత్రం ఓ కంట కనిపెట్టుకునే ఉండాలని ఆదేశించారు. వారికి ఎక్కడా ఎటువంటి కష్టం నష్టం రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో ఆయనతోపాటు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో డి సాంబశివరావు, జేఈవో శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.