గాలి జనార్థన రెడ్డికి తిరుమలలో రాచమర్యాదలు.. ఇవ్వడం తప్పా...! ఒప్పా...!?
మాజీ ఎంపి, గనుల కేసులో ముద్దాయి అయిన గాలి జనార్థన రెడ్డికి తిరుమలలో శనివారం రాచమర్యాదలు లభించాయి. ఆయనకు ప్రత్యేకమైన అతిథి గృహాన్ని ఇచ్చారు. కోరకున్నట్లు దర్శనం కల్పించారు. కోరినన్ని లడ్డూలు ఇచ్చారు. ఒక కేసులో ముద్దాయి. మరి అలాంటి జనార్థన రెడ్డి రాచమర్యాదులు ఇవ్వచ్చా... టీటీడీ అధికారులకు మతి ఉంటే ఈ పని చేశారా... ఇలా ఎన్నో ప్రశ్నలు సంధించే వారున్నారు. జనార్థన రెడ్డికి టీటీడీ మర్యాదలు కల్పించడం తప్పా..! అవన్నీ తెలిసి టీటీడీ ఎందుకు ఈ మర్యాదలు చేసినట్లు? వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పథకాలున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇన్ని ఆస్తులు.. ఇన్ని ఆభరణాలు వచ్చాయంటే అందులో సామాన్య భక్తులకు ఎంతటి భాగస్వామ్యం ఉందో.. విఐపి భక్తులకు అంతే భాగస్వామ్యం ఉంది. అందుకే ఇటు సామాన్య భక్తులకు, అటు విఐపిలకు మధ్యన టీటీడీ ఎప్పుడూ నలిగి పోతుంటుంది. తిరుమలలో గెస్ట్ హౌసులు కట్టించుకునే వారు. టీటీడీ చేస్తున్న వైద్య, విద్యా, అన్నదాన సేవలకు దాతలు ఎంతో ఆర్థిక సాయం చేస్తుంటారు.
ఇలా విఐపిలు తిరుమలో అతిథి గృహాలు కట్టించిన వారు ఎంతో మంది ఉన్నారు. రిలయన్స్ మొదలుకుని సుబ్బురామి రెడ్డి వరకూ ఇలా దాతలు ఎందరో అతిథి గృహాలను కటించిన వారిలో ఉన్నారు. వీరందరికి తిరుమలలో కొన్ని సదుపాయాలు ఉంటాయి. వారు ఏడాదిలో కొన్నాళ్లు ఆ గెస్ట్ హౌస్ లో ఉండవచ్చు. వారికి దర్శన సౌకర్యం కల్పిస్తారు. చివరకు వారి సిఫారస్సులతో పంపిన వారికి కూడా దర్శన సౌకర్యం ఉంటుంది. అందులోనూ రక రకాల దర్శనాలు కల్పిస్తారు. ఇవి బ్రేక్ దర్శనం మొదలుకుని ఉన్న సేవలలో చాలా రకాల సేవలలో వీరు పాల్గొన వచ్చు. వీరంతా రూ. 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ వివిధ పథకాలకు ఇచ్చిన దాతలే.
ఇక గాలి జనార్థన రెడ్డి విషయానికి వద్దాం. నేరుగా చెప్పాలంటే ఆయనే తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద విఐపి. ఆయన స్వామి వారికి ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాల కిరిటాన్ని చేయించారు. బహుశా ఆయనే పెద్ద దాత. అలాంటి జనార్థన రెడ్డికి టిటిడి మర్యాదలు చేసింది. ఇది తప్పని సరి.. టీటీడీ నియమనిబంధనలలో ఉన్న సదుపాయాలే. గతంలో కూడా ఒక్కమారు జనార్థన రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడు దాదాపు ఇలాంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. పైగా ఆయనపై విచారణ జరుగుతున్నప్పుడు ఆయన ఇచ్చిన వజ్రాల విగ్రహాన్ని కూడా వెనక్కి తీసుకుంటారనే వాదనలు కూడా వినిపించాయి.
ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దీనిపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఆయన స్వామి వారికి భక్తితో ఇచ్చిన కానుకను కానుకగానే చూస్తామని తేల్చి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమనిబంధనల మేరకు ఆయన తమకు విఐపినే అవుతారని చెప్పారు. మరి ఇలాంటి తరుణంలో బెయిలుపై వచ్చిన గాలి జనార్థన రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం మర్యాద చేసింది. నియమనిబంధనల మేరకు టీటీడీ చేసింది తప్పు కాదు. కానీ, అవినీతి మసకబారిన జనార్థన రెడ్డికి మర్యాద చేయడం నైతికంగా సమంజసమా అనే ప్రశ్నకు ఆయన తనపై వచ్చిన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే వరకూ సమాధానం దొరకదు.
