ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By chj
Last Modified: శనివారం, 12 నవంబరు 2016 (20:04 IST)

కార్తీక మాస విశేష దినం కార్తీక పౌర్ణమి... సోమవారం నాడు ఇలా చేయండి...

కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటారు. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతిక

కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటారు. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపలు తొలగి, మోక్షం కలుగుతుందని చెబుతారు. దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసంలో చేసే దీప దానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. 
 
కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. గంగా, గోదావరి మొదలైన పుణ్య నదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగగా జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురున్ని సంహరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తుంది.
 
కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. 
 
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టినవారు శ్రీమహా విష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసినవారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. స్తంభ దీపం పెట్టని పిత్రు దేవతలకు నరక విముక్తి కలగదంటారు. ఈ రోజున ధ్వజ స్తంభం పైన నందా దీపం వెలిగిస్తారు.
 
జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసం లోని కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. కార్తీక జ్వాలాదర్శనం వలన మానవులకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. 
 
అట్లే మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే… కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.
 
కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన ఎంతో ప్రాముఖ్యమైనది. ఏకతస్సర్వదానాని దీపదానం తథైకత అని శాస్త్రవచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీపదానం ఒక ఎత్తు అని అర్ధం. దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసి వారే స్వయంగా ఒత్తులను తయారుచేయాలి. వరిపిండి, గోధుమ పిండితో ప్రమిదను తయారుచేసి అందులో ఒత్తిడిని ఉంచి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి పూజింజి దానికి నమస్కరించి కార్తీక సోమవారం లేదా పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఏ రోజునైనా, శైవ వైష్ణవాలయాల్లో ఉత్తముడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. కార్తీక మాసమంతా ప్రతీ ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా తులసీ బృందావనం దగ్గర దీపాలను వెలిగించడం మన సంప్రదాయం. దీపం వెలిగించిన తర్వాత “దీపంజ్యోతి పరబ్రహ్మః దీపం సర్వతమో పహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యాదీప నమోస్తుతే” శ్లోకం ద్వారా స్తుతించడం మన ఆచారం. 
 
కార్తీక పౌర్ణమి రోజున సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించాలి. వాకిలి ముందు ప్రమిదలను వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారని నమ్మకం. ఇతరుల వెలిగించిన దీపాన్ని ఎవరైతే ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. కార్తీకమాసంలో సువాసినులు ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని “ఓం లక్ష్మైనమః..” ధ్యానించి పూజించాలి.