తెలుగు గంగ నుంచి తిరుమలకు ప్రత్యేక పైపు లైను
తిరుమలలో తరచూ వచ్చే తాగునీటి ఎద్దడిని నివారించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది. ఎక్కడా నీటి కొరత లేకుండా ఉండడానికి శాశ్వత పరిష్కార మార్గాలను వెతుకుతోంది. బుధవారం తిరుపతిలో ఉన్నత స్థాయి అధికారులతో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.సాంబశివరావు ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అసలు ఎందుకు నీటి కొరత ఏర్పడుతోంది. నివారణకు మార్గాలేమిటీ అనే అంశాలపై చాలా సేపు చర్చించారు.
చర్చల అనంతరం తెలుగు గంగ నుంచి తిరుమల తాగు నీటి కోసం ఓ ప్రత్యేక పైపు లైనును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. దీనికి తాగునీటీ శాఖ చీఫ్ ఇంజినీరింగ్ అధికారి పాండురంగారావు అనుకూలంగా స్పందించారు. ఇప్పటి వరకూ తెలుగు గంగ నుంచి 7 ఎంఎల్డి నీరు తిరుపతి వస్తోంది. అయితే ఇందులో 1.5 ఎంఎల్డీ నీరు తిరుపతి అవసరాలకు, 5.5 ఎంఎల్డీ నీరు తిరుమల అవసరాలకు కోసం వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న నీరు వచ్చే జులై వరకూ సిరపోయినప్పటికీ ప్రతీ రోజు అదనంగా మరో ఎం ఎల్డీ నీటిని కేటాయించాలని కోరారు. ఇది డిసెంబర్ 25 నుంచే అమలులోకి వస్తుంది. అందుకు తిరుపతి కార్పోరేషన్ కూడా అనుమతించింది. నీటిని తరలించడానికి ప్రత్యేకమైనటువంటి పైపులైను వేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, టిటిడి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
