అనారోగ్యంతో ఆరెంజ్ జ్యూస్ తాగింది.. అంతే ఉద్యోగం పోయింది...
మధుమేహంతో బాధపడుతున్న ఓ ఉద్యోగిని అనారోగ్య కారణం వల్ల ఆరంజ్ జ్యూస్ తాగేసిందని ఆమెను కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసిన ఘటన అమెరికాలోని టెనెస్సీలో చోటుచేసుకుంది. అమెరికాలో రిటైల్ చైన్ నడుపుతున్న డాలర్ జన
మధుమేహంతో బాధపడుతున్న ఓ ఉద్యోగిని అనారోగ్య కారణం వల్ల ఆరంజ్ జ్యూస్ తాగేసిందని ఆమెను కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసిన ఘటన అమెరికాలోని టెనెస్సీలో చోటుచేసుకుంది. అమెరికాలో రిటైల్ చైన్ నడుపుతున్న డాలర్ జనరల్ కు పాఠం నేర్పిందీ ఘటన. కేవలం 1.69 డాలర్ల (సుమారు రూ.115) విలువైన ఆరంజ్ జ్యూస్‌ను ముందు డబ్బు చెల్లించకుండా తాగిందని పనిలోంచి తీసేసిన సంస్థ ఇప్పుడామెకు పరిహారంగా 2,77,656 డాలర్లు (సుమారు రూ.1.86 కోట్లు) పరిహారంగా ఇచ్చుకోనుంది.
ఆ వివరాల్లోకెళ్తే.. 2014 సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది. టెనెస్సీలోని మేరీవిల్లేలో డాలర్ జనరల్ స్టోర్‌లో క్యాషియర్‌గా పనిచేసే మహిళ మధుమేహంతో బాధపడుతోంది. దాంతో కౌంటర్ దగ్గర ఎప్పుడూ జ్యూస్ పెట్టుకోవాల్సి వచ్చేది. అందుకు స్టోర్‌లోని సూపర్‌వైజర్ అంగీకరించలేదు. స్టోర్‌లోని ఉద్యోగులెవరూ అలా చేయడానికి వీల్లేదని చెప్పారు. అయితే ఒక రోజు ఆమె కళ్లు తిరుగుతున్నట్లు అనిపించి వెంటనే అక్కడున్న ఆరంజ్ జ్యూస్ తాగేసింది. దాని ధర కేవలం 1.69 డాలర్లు (సుమారు రూ.112). తర్వాత దానికి డబ్బు చెల్లిస్తానని చెప్పింది. కొనకముందే డ్రింక్ తాగి నిబంధనలు ఉల్లంఘించిందంటూ స్టోర్ డిస్ట్రిక్ట్ జనరల్ మేనేజర్ ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశారు.
దీంతో ఆమె అమెరికాలోని ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీ కమిషనర్(ఈఈఓసీ)ను ఆశ్రయించింది. ఈ కమిషన్ సహాయంతో ఆమె కోర్టుకు వెళ్లింది. విచారణ అనంతరం కోర్టు ఆమెకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డాలర్ స్టోర్ జనరల్ మేనేజర్‌ను ఆదేశించింది. అమెరికన్ డిజబిలిటీ చట్టాల ప్రకారం, రుగ్మతలతో ఉన్న ఉద్యోగులు, వారికి సంబంధించిన ఔషధాలు, పానీయాలను పక్కన పెట్టుకునే హక్కును కలిగివుంటారని, ఉద్యోగుల హక్కును డాలర్ జనరల్ కాలరాసిందని జ్యూరీ వ్యాఖ్యానించింది.
27,565 డాలర్లు గతంలో పనిచేసినందుకు చెల్లించాలని, 2,50,000 డాలర్లు నష్టపరిహారం కింద చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం 2,77,656 డాలర్లు (సుమారు రూ.1.85కోట్లు) మహిళకు చెల్లించాల్సి వస్తోంది. ఈ తీర్పుపై ఈఈసీఓ హర్షం వ్యక్తంచేసింది. అందరికీ సమాన అవకాశాల గురించి తమ సంస్థ పోరాడుతూనే ఉంటుందని తెలిపింది.