గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (20:24 IST)

బీజింగ్‌లో ఇసుక తుఫాను.. యుగాంతం వచ్చేసిందా..? 341 మంది గల్లంతు!

sandstorm
చైనా రాజధాని బీజింగ్‌లో ప్రస్తుతం ఓ ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు దశాబ్దం తరువాత బీజింగ్ ప్రజలు ఈ స్థాయి తుఫానును చూస్తున్నారు. దీనికి తోడు..వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరగడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ తుఫాను ప్రభావం చైనాలోని పన్నెండు ప్రావిన్సులపై ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
మధ్య, ఉత్తర మంగోలియాలో ప్రారంభమైన తుఫానుకు ఎగువన ఉన్న చలిగాలులు తోడవడంతో తుఫాను తీవ్ర రూపం దాల్చిందని, గాలి దిశను అనుసరిస్తూ దక్షిణాన ఉన్న బీజింగ్ వైపు వచ్చిందని చైనా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో గోబీ ఏడారిలోని దుమ్ము, ధూళి ఇసుక బీజింగ్‌ను ముంచెత్తుతోందని పేర్కొంది. ఇసుక తుఫాను తీవ్రత దృష్ట్యా స్కూళ్లు, బహిరంగ క్రీడా కార్యక్రమాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శ్వాసకోస సమస్యలు ఉన్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇల్లు దాటకూడదంటూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
 
ఈ తుఫాను కారణంగా పొరుగున ఉన్న మంగోలియాలో కనీసం 341 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు.. బీజింగ్ నగరంలో కనిపిస్తున్న భయానక దృశ్యాలను ప్రజలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. యుగాంతం వచ్చేసిందా అన్నట్టు నగరంలోని పరిస్థితి ఉందని కామెంట్లు పెడుతున్నారు.