బీజింగ్‌లో కరోనా కలకలం.. ఫుడ్ డెలివరీ మ్యాన్ ద్వారా కోవిడ్
చైనా దేశంలోని బీజింగ్ నగరంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ డెలివరీ మ్యాన్ ద్వారా కరోనా వైరస్ వ్యాపించింది. ఫుడ్ డెలివరీ మ్యాన్‌కు కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది.
చైనా రాజధాని నగరమైన బీజింగ్‌లో 47 ఏళ్ల ఫుడ్ డెలివరీ మ్యాన్ జూన్ 1నుంచి 17వతేదీ వరకు డాక్సింగ్, ఫంగ్ షాన్, డాంగ్ చెంగ్, ఫెంగటయ్ ప్రాంతాల్లో రోజుకు 50 మందికి చొప్పున ఆహారాన్ని డెలివరీ చేశారు. దీంతో ఫుడ్ డెలివరీ మ్యాన్ ను క్వారంటైన్‌కు తరలించారు.
ఫుడ్ డెలివరీ ఎవరెవరికి చేశాడనే విషయంపై వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు ఆరా తీస్తున్నారు. చైనా దేశంలో కొత్తగా 29 మందికి కరోనా వైరస్ సోకిందని చైనా ఆరోగ్యసంస్థ అధికారులు ప్రకటించారు. మొత్తంమీద 249 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
ఫుడ్ డెలివరీ మ్యాన్ ద్వారా కరోనా ప్రబలిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో ఏడు కేసులు అసింప్టెమాటిక్ అని అధికారులు చెప్పారు. మళ్లీ కరోనా వైరస్ ప్రబలుతుండటంతో బీజింగ్ నగరంలో మళ్లీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.