గురువారం, 7 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఆగస్టు 2025 (11:06 IST)

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

deepika padukone
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇన్‌స్టా కోసం చేసిన ఒకే ఒక్క రీల్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు వచ్చాయి. ప్రపంచంలోనే ఈ వేదికగా ఎక్కువమంది చూసిన రీల్‌గా ఇది నిలిచింది. గతంలో ఈ విషయంగా రికార్డులు సృష్టించిన హార్దిక్ పాండ్యా, క్రిస్టియానో రొనాల్డోలనూ దాటి అందరినీ ఆశ్చర్యపరిచిందీమె. ఇది చూసినవారంతా సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ దీపిక క్వీన్ అంటున్నారు.
 
కాగా, 20 ఏళ్ల కెరియర్‌లో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్‌హిట్‌గా నిలవడమే కాదు వసూళ్లలోనూ రికార్డులు సృష్టించాయి. హాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుంది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు గ్లోబల్ అంబాసిడర్ కూడా. దీంతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులూ ఉన్నారామెకు. ఫోర్బ్స్, టైమ్స్ జాబితాల్లోనూ నిలిచింది. ప్రముఖ మ్యాగజీన్ 'షిఫ్ట్' దీపికను ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా ప్రకటించింది. 
 
'హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026'కీ ఎంపికై, ఆ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటిగానూ నిలిచింది. తాజాగా తన పేరుమీద మరో రికార్డును లిఖించుకుంది దీపిక. ఇన్‌స్టాలో రీల్స్‌కు ఉండే క్రేజ్ ఏంటో తెలుసు కదా? ఎక్కువమందిని ఆకర్షించడానికి చాలామంది కొత్తకొత్తగా ఏవేవో ప్రయత్నిస్తుంటారు కూడా. తారలూ ఇందుకు మినహాయింపు కాదు. అభిమానులకు చేరువగా ఉండటానికి తమ వ్యక్తిగత, వృత్తి జీవితాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంటారు. కానీ దీపిక మాత్రం ఈ విషయంలో బాస్ అనిపించుకుంది. 'హిల్టన్' సంస్థతో కలిసి ఇటీవల ఒక యాడ్ చేసిందామె. దాన్నే ఇన్‌స్టాలో పంచుకుంది. దానికి ఏకంగా 190 కోట్ల వీక్షణలు వచ్చాయి.