ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జాను ఆ లిస్టులో చేర్చిన ఐరాస
అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా లాడెన్‌పై ఇప్పటికే అమెరికా ఒక మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. అలాగే నవంబరులో జారీ చేసిన ప్రభుత్వ ఆదేశాల మేరకు హమ్జా పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.
బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా కమెండోలు మట్టుబెట్టినా అతని కుమారుడు హమ్జా బిన్ లాడెన్ అల్‌ఖైదాకు జీవం పోస్తున్నాడని అగ్రరాజ్యమైన అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో హమ్జాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో ఆస్తులను స్తంభించేసింది. ఇంకా ఆయుధాల వ్యాపారం, ప్రయాణాలపై నిషేధం విధించింది.
అంతేగాకుండా అల్‌ఖైదాకు ప్రస్తుత నాయకుడైన ఐమన్ అల్ జాహిరికి వారసుడిగా హమ్జాను గుర్తిస్తూ అతడ్ని బ్లాక్ లిస్టులో ఉంచింది. విధించిన ఆంక్షలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను ఆదేశించింది.