కురచ దుస్తులు వేసుకుందనీ విమానం ఎక్కనీయలేదు!
విమానంలో ఎక్కడానికి వచ్చిన యువతికి ఎయిర్ లైన్స్ అధికారులు దిమ్మదిరిగే షాక్ నిచ్చారు. ఆమె దుస్తులు సరిగా లేవన్న కారణం చేత విమానంలోకి ఎక్కడానికి అనుమతివ్వలేదు. మసాచుసెట్స్‌లోని లోగాన్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాగీ మెక్ మఫ్ఫీన్ లోగాన్‌లో జెట్ బ్లూ ఎయిర్ లైన్స్‌లో ప్రయాణించి బోస్టన్ చేరుకుని, అక్కడ కనెక్టింగ్ ఫ్లయిట్ అందుకుని న్యూయార్క్‌కు వెళ్లాల్సిన నేపథ్యంలో అధికారులు ఆమెను అడ్డుకున్నారు.
ఎందుకో తెలుసా.. ఆ యువతి ఓ స్వెట్టర్, చిన్న షార్ట్ వేసుకుందని, పొడవాటి సాక్సు ధరించిందని జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. సీటెల్‌కు చెందిన మాగీ చిట్టి పొట్టి దుస్తులు ధరించిందని ఆమెను దుస్తులు మార్చుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలా మార్చుకోని పక్షంలో విమానంలో ఎక్కేందుకు ససేమిరా అనుమతించబోమని అధికారులు తెలిపారు. దీంతో వేరే మార్గం లేక మాగీ.. 22 డాలర్లు ఖర్చుపెట్టి కొత్త షార్ట్స్ కొనుక్కుంది. ఆ తర్వాత హాయిగా ప్రయాణించి బోస్టన్ చేరుకుంది.