శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (17:19 IST)

ఇటలీని వెనక్కి నెట్టిన అమెరికా-24 గంటల్లోనే 1,169 మంది మృతి

ఇటలీ తర్వాత అమెరికాలో కరోనా కారణంగా మరణ మృదంగం మొదలైంది. అమెరికాలో ఈ మహమ్మారి కారణంగా కేవలం 24 గంటల్లోనే 1,169 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కరోనా కారణంగా ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించలేదని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ ద్వారా మృతుల సంఖ్య వెల్లడైంది.

కాగా.. ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో ఇప్పటివరకు ఇటలీ(969) ముందుండగా.. ప్రస్తుతం ఆ స్థానంలోకి అమెరికా(1169) చేరింది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తంగా 6,095 మంది మృత్యువాత పడినట్లు అధికారులు చెప్తున్నారు.

అంతేగాకుండా తాజాగా దేశంలో కరోనా ధాటికి 2.40లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని తెలుపడం కలకలం రేపింది. దీన్ని బట్టి ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సేవలున్న అమెరికా కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైంది.