శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (17:12 IST)

కొండెక్కిన బంగారం... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కరోనా వైరస్ దెబ్బకు బంగారం ధరలు మరోమారు కొండెక్కాయి. అదేసమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం కుప్పకూలిపోయాయి. దీనికి కారణం... ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో మదుపుదారులు షేర్లను అమ్మి బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. 
 
సంక్షోభ సమయంలో సురక్షిత సాధనంగా పసిడి వైపు ఇన్వెస్టర్లు పరుగులు పెడుతుండటంతో యల్లో మెటల్‌ మరింత ప్రియమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.530 భారమై రూ.43,770కి చేరింది. ఇక రూ.1348 పెరిగిన వెండి కిలో ధర ఏకంగా రూ.41, 222కి ఎగబాకింది. 
 
మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 674 పాయింట్లు నష్టపోయి 27,590కి పడిపోయింది. నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 8,083కి దిగజారింది.