గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (13:37 IST)

మా బాలయ్య బాలయ్యే... చిరంజీవి ప్రశంసలు

తన సహచర నటుడు నందమూరి బాలకృష్ణపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. మా బాలయ్య బాలయ్యేనంటూ కితాబిచ్చారు. పైగా, ఎపుడు కష్టమొచ్చినా తాను ముందుంటాను అని మరోమారు నిరూపించారని చెప్పుకొచ్చారు.
 
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో సినిమా షూటింగులన్నీ రద్దు అయ్యాయి. ఈ కారణంగా అనేక మంది పేద సినీ కళాకారులు, టెక్నీషియన్లు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు చిరంజీవి రంగంలోకి దిగి కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం అనే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. 
 
సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ సంస్థకు విరాళాలు ఇస్తే, పేద కళాకారులను ఆదుకుందామని ఆయన పిలునిచ్చారు. దీంతో అనేకమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు భారీ ఎత్తున సిసిసి మనకోసం విరాళాలు ఇస్తున్నారు. తాజాగా హీరో బాలకృష్ణ కూడా 1.25 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. 
 
ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధికి రూ.50 లక్షలు, సిసిసికి రూ.25 లక్షలు చొప్పున మొత్తం 1.25 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మొత్తాన్ని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చేతికి అందజేశారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ, మా బాలయ్య బాలయ్యే.. ఎపుడు ఆపద వచ్చినా అందరికంటే ముందుంటారని కొనియాడుతూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.