వామ్మో చిరంజీవి తెలివి... సినీ కార్మికులకే కాదు దాతలకూ సాయం.. ఎలా?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవిని చెప్పుకుంటుంటారు. సినీ ఇండస్ట్రీలోని వారికి ఏ ఆపద వచ్చినా ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వస్తారు. అలా తన వద్దకు వచ్చేవారికి ఆయన తగిన విధంగా న్యాయం చేయడమో, ఆదుకోవడమే జరుగుతోంది.
ఇపుడు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. ఇలాంటి కష్టకాలంలో సినీ ఇండస్ట్రీనే నమ్ముకున్న అనేక మంది పేద కళాకారులు ఉన్నారు. వీరంతా పూటగడవక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవికి వారిని ఆదుకోవాలన్న సంకల్పం ఏర్పడింది. అంతే... కరోనా క్రైసిస్ చారిటబుల్ మనకోసం అనే పేరుతో ఓ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ట్రస్ట్ ఏర్పాటు కాకముందు అనేక సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాలకు తమవంతుగా విరాళాలు ఇస్తూ వచ్చారు. అయితే, ఈ సిసిసి ఏర్పాటైన తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇచ్చే విరాళాలు గణనీయంగా తగ్గిపోయాయి. సినీ ప్రముఖులంతా తమకుతోచిన విధంగా సిసిసికి సహాయం చేయసాగారు. కానీ, సిసిసికి నేరుగా విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపు ఉండదు.
అందుకే విరాళాలు ఇచ్చే వారిని కూడా ఆదుకోవాలని సంకల్పించారు. ఇందులోభాగంగా చిరంజీవికి ఓ కొత్త ఆలోచన వచ్చింది. అంతే.. దాన్ని తన వియ్యంకుడు, ప్రముఖ అల్లు అరవింద్‌తో కలిసి పక్కాగా అమలు చేశారు. ఆ ప్లాన్ ప్రకారం.. సిసిసి మనకోసం ట్రస్టును తన సొంత చారిటబుల్ ట్రస్ట్ అయిన చిరంజీవి చారిటుబుల్ ట్రస్ట్‌లో అనుసంధానం చేశారు.
అంటే.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో భాగంగానే సిసిసి మనకోసం ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల సిసిసి మనకోసం విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు నోరెళ్ళబెడుతున్నారు. చిరంజీవి తెలివి ముందు మనం పనికిరామని, అందుకే ఆయన మెగస్టార్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఈ సిసిసి మనకోసం ఏర్పాటులో నిర్మాత అల్లు అరవింద్ అత్యంత కీలక పాత్ర పోషించడం గమనార్హం.