శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (15:02 IST)

డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాక్ : 70 వేల ఖాతాలు బ్లాక్!

మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ తేరుకోలేని షాకిచ్చింది. ఇప్పటికే ట్రంప్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయగా, ఇపుడు ఆయనకు అనుకూలంగా ఉన్న 70 వేల ఖాతాలను కూడా ట్విట్టర్ బ్లాక్ చేసింది. 
 
గత యేడాది నవంబరు నెలలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపై న్యాయపోరాటం చేసినా ఆయనకు చేదు అనుభవమే ఎదురుగా కాగా.. పార్లమెంట్‌పై దాడి చేసేలా తన అభిమానుల్ని ట్రంప్‌ రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఇప్పుడు ఆయనను కుదిపేస్తున్నాయి. 
 
ఓవైపు ట్రంప్‌ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.. మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్‌కు సంబంధించిన ఖాతాలను నిలిపివేశాయి.. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ ఊహించని విధంగా ఆయనకు అనుకూలంగా ఉన్న 70 వేల ఖాతాలను కూడా ట్విట్టర్ బ్లాక్ చేసింది. 
 
వాషింగ్టన్‌లోని కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి, విధ్వంసం తర్వాత.. ఈ దాడులను ప్రోత్సహిస్తూ హింసను ప్రేరేపించే విధంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టులు ఉండడంతో.. గత శుక్రవారం ఆయన వ్యక్తిగత ఖాతాను మొదట 12 గంటల పాటు నిలిపివేసిన ట్విట్టర్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రంప్ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. 
 
అంతటితో సోషల్ మీడియాలో ట్రంప్ అలజడి ఆగలేదు.. ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఇది, మరే ప్రమాదానికి దారితీస్తోందని అలర్ట్ అయిన ట్విట్టర్.. ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న సుమారు 70 వేల ఖాతాలను కూడా నిలిపివేస్తూ సంచలన ప్రకటన చేసింది. 
 
వాషింగ్టన్ విధ్వంసం దృష్ట్యా, హింసను ప్రేరేపించే విధంగా పోస్టులు పెట్టిన వారి ఖాతాలను శాశ్వతంగా తొలిగించే ప్రక్రియను ప్రారంభించాం.. అందులో భాగంగా ఈ ఘటనకు సంబంధించి ట్వీట్లలో హింసాత్మక కంటెంట్ ఉన్నవారి ఖాతాలను పూర్తిగా తొలగిస్తున్నాం. అందుకే తాజాగా 70 వేల ఖాతాలను శాశ్వతంగా తొలగించడం జరిగిందని పేర్కొంది.