గినియాలో ఎబోలా వైరస్
ఇప్పటికే కరోనా తో అల్లాడిపోతున్న గినియాను ఎబోలా కూడా చుట్టుముట్టేసింది. ఎబోలా వైరస్‌తో ముగ్గురు మరణించిన తర్వాత తమ దేశంలో ఈ వైరస్ వుందని గినియా ప్రకటించింది. మరో నలుగురు ఈ వైరస్‌తో అస్వస్థులయ్యారు.
లైబేరియా సరిహద్దుల్లో గోయకేలో ఒక అంత్యక్రియలకు హాజరైన ఈ ఏడుగురు డయేరియా, వాంతులు, రక్తస్రావంతో బాధపడ్డారు. బాధితులందరినీ చికిత్సా కేంద్రాల్లో విడిగా వుంచి వైద్యం చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎబోలా వైరస్ వున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2013-16 మధ్య కాలంలో గినియాలో ప్రారంభమైన ఈ వైరస్‌తో పశ్చిమాఫ్రికాలో 11,300 మంది మరణించారు.
ప్రధానంగా గినియా, లైబేరియా, సియర్రా లియోన్‌లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎబోలా వైరస్ నిర్ధారణ కోసం రెండో రౌండ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుల మూలాలను కనుగొనేందుకు ఆరోగ్య సిబ్బంది కృషి చేస్తున్నారు. ఎబోలా వ్యాక్సిన్ల కోసం గినియా ఇప్పటికే డబ్ల్యుహెచ్‌ఓను సంప్రదించింది.