శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:30 IST)

చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువ.. కాబట్టి కరోనా సోకదు.. ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదంలో చిక్కుకున్నారు. చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరోనా వారికి సోకదు అనేలా ట్రంప్ తాజాగా ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ప్రపంచమంతటా గగ్గోలు పుట్టించింది. అంతే అధ్యక్షుడి పోస్ట్ తప్పుడు సమాచారంతో ఉందని భావించిన ఫేస్‌బుక్ దాన్ని వెంటనే తొలగించింది.
 
అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి పోస్టును పూర్తిగా తొలగించడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్‌ విషయంలో భయాన్ని సృష్టిస్తున్న, తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వాటిని సైట్‌ నుంచి ఫేస్‌బుక్‌ వెంటనే తొలగిస్తోంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన పోస్ట్‌ను కూడా ఫేస్‌బుక్‌ తొలగించడానికి వెరవలేదు. పైగా దేశాధ్యక్షుడు ఇచ్చిన సమాచారం హానికరమని ఫేస్ బుక్ వ్యాఖ్యానించింది.
 
ట్రంప్‌ తాజాగా వీడియోను పోస్ట్ చేస్తూ, కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఉంటుందని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీంతో తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కరోనా వైరస్‌పై డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారని ఫేస్‌బుక్‌ పేర్కొంది. కోవిడ్-19 వైరస్ సోకిన పిల్లలు పెద్దలతో పోలిస్తే తక్కువ రోగ లక్షణాలను కలిగి ఉంటారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.