బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 30 మే 2017 (02:16 IST)

బిన్‌లాడెన్‌కు బాగా తెలిసినవారే డెన్ లీక్ చేశారు.. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పేసిన భార్య

ప్రపంచ ఉగ్రవాద చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని ముగించిన విశిష్టమైన దినం 2011 మే 1. అమెరికన్ గర్వాన్ని, సాయుధ బల అహంకారాన్ని చిత్తుగా పడగొట్టి అమెరికా గడ్డపై మొట్టమొదటి దాడికి తలపడి మారణ హోమం సాగించిన అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్‌ను పాకిస్తాన్ లోని అబుత్

ప్రపంచ ఉగ్రవాద చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని ముగించిన విశిష్టమైన దినం 2011 మే 1. అమెరికన్ గర్వాన్ని, సాయుధ బల అహంకారాన్ని చిత్తుగా పడగొట్టి అమెరికా గడ్డపై మొట్టమొదటి దాడికి తలపడి మారణ హోమం సాగించిన అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్‌ను పాకిస్తాన్ లోని అబుత్తబాద్ పట్టణంలోని డెన్‌లోకి దూరి మరీ అమెరికన్ సీల్ కమాండోలు హతమార్చిన రోజది. అమెరికా సంపదకు, వైభవానికి నిలువెత్తు నమూనాగా నిలిచిన ట్విన్ టవర్స్‌ను ఏకంగా అమెరికన్ విమానాలతోనే ఢీకొట్టించి అల్‌ఖైదా సవాల్ విసిరిన రోజది.

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం, రక్షణ శాఖ భవంతి పెంటగాన్‌లపై దుస్సాహసిక దాడి చేయడానికి ప్రేరేపించిన అల్‌ఖాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను ఎంతో పకడ్బందీగా ప్రణాళిక రచించి గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసి అతడిని అంతమొందించింది ఆ రోజే. అయితే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై అన్ని చెప్పుడు కథనాలే తప్ప ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పలేదు.
 
పాకిస్తాన్ లోని బిన్ లాడెన్ డెన్‌పై దాడిలో పాల్గొన్న సీల్ కమాండోల్లో కొందరు ఆరోజు రాత్రి హెలికాప్టర్లో వెళ్లి బిన్ లాడెన్ డెన్‌పై దిగి క్షణాల వ్యవధిలో అతడిని ఎలా చంపామనే విషయంపై పుంఖానుపుంఖాలుగా చెప్పేశారు. కానీ లాడెన్‌తో పాటు ఆ సమయంలో అక్కడే ఉండి కమాండోల కాల్పులకు గురై కూడా ప్రాణాలతో బయటపడిన లాడెన్ భార్య జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని ఇన్నేళ్లకు ఆమె బయటపెట్టింది. 
 
లాడెన్‌ నాలుగో భార్య అమల్‌ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని కాతీ స్కాట్‌-క్లార్క్‌, అడ్రియాన్‌ లెవీ ఇద్దరికి వెల్లడించింది. వీరు లాడెన్‌ చనిపోవడానికి ముందు ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై వీరు ది ఎక్సైల్‌ ది ఫైట్‌ ఆఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ అనే పేరిట ఓ పుస్తకం రాస్తున్నారు. దీనికి సంబంధించి లాడెన్‌ భార్యను నేరుగా వారు సంప్రదించగా కొన్ని విషయాలు చెప్పింది. అందులో కొన్ని బ్రిటన్‌లోని సండే టైమ్స్‌లో, ఓ టీవీ చానెల్‌లో ప్రచారం అయ్యాయి. అలా ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం.
 
‘ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌లో అబోటాబాద్‌లోని మా ఇంటి కాంపౌండ్‌లోకి దిగింది. అప్పటికే మేం ఆ ఇంట్లో ఆరేళ్లుగా తలదాచుకుంటున్నాం. హెలికాప్టర్‌ శబ్దం విని మేల్కొన్న నా భర్త(లాడెన్‌) ముఖంలో చాలా భయం చూశాను. అమెరికన్‌ సీల్స్‌ ఇంటిలోపలికి ప్రవేశిస్తుండగా మా సోదరీలు(లాడెన్‌ ముగ్గురు భార్యలు) (అమల్‌ లాడెన్‌ నాలుగో భార్య) వారి పిల్లలను తీసుకొని ఆయన ఉన్న అప్‌స్టెయిర్స్‌కు వెళ్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. 
 
అయితే, వారిని అక్కడ ఉండొద్దని, అందరినీ కిందికి వెళ్లిపోవాలని లాడెన్‌ చెప్పాడు. వారికి కావాల్సింది నేను.. మీరు కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోండని అన్నారు. అయితే, మిగితా వారు వెళ్లిపోగా నేను మాత్రం ఆయన పక్కన నా కొడుకు హుస్సేన్‌తో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నాను. అమెరికా సైనికులు లోపలికి వస్తూ లాడెన్‌ కుమారుల్లో ఒకరైన ఖలీద్‌ను చంపేస్తూ పిల్లలతో గొడవపడుతూ పైకి వస్తున్నారు. సరిగ్గా మేం ఉన్న గదికి రాగానే నేను వారిని తోసివేసేందుకు ప్రయత్నించాను. కానీ, వారు ఫైరింగ్‌ స్టార్ట్‌ చేయగా నా కాలికి తగిలి పక్క గదిలో పడిపోయాను. 
 
ఆ తర్వాత ఓపిక చేసుకొని తిరిగొచ్చి చూసేసరికి అప్పటికే లాడెన్‌ చనిపోయి ఉన్నాడు.  తన నాన్నను అమెరికన్ కమాండోలు కాల్చి చంపిన ఆ దృశ్యాన్ని నా కొడుకు హుస్సేన్‌ చూశాడు. అది చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను’ అని వారికి చెప్పిందట. దాంతోపాటు తమకు తెలిసిన వారే ఈ విషయాన్ని వారికి చేరవేసి ఉంటారని, ఆ ఇళ్లే తమకు మృత్యుకుహరం అవుతుందని ఊహించలేకపోయామని కూడా ఆమె చెప్పినట్లు బ్రిటన్‌ పత్రికలో వెల్లడించారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది.
 
ప్రపంచ యుద్ధాల్లో, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లో కొన్ని వందల సార్లు జరిగినట్లే  బిన్ లాడెన్ కూడా శత్రువు సామర్థ్యం వల్ల కాకుండా ఇంటి శత్రువు లేదా ఇన్ సైడర్ తలపెట్టిన ద్రోహం వల్లే హతమయ్యాడని లాడెన్ భార్య ప్రత్యక్ష సాక్ష్యమే చెబుతోంది. తూటా గురిపెట్టినవాడు ఏదో ఓ రోజున ఆ తూటాకే బలవటం తప్పదని బిన్ లాడెన్ సైతం మరోసారి నిరూపించాడు మరి.