గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (09:29 IST)

ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్... నేలను బలంగా ఢీకొట్టడంతో మంటలు.. 41 మంది మృతి

రష్యాలోని మాస్కోలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. మరో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఆ తర్వాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్టు విమాన సిబ్బంది గుర్తించి అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
 
ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలుపుకుని 78 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో 41 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వీరిలో ఆరుగురు గాయపడ్డారని అధికారులు వివరించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
 
నిత్యం రద్దీగా ఉండే షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరగానే సాంకేతిక లోపాలు గమనించడంతో సిబ్బంది విపత్తు సంకేతాలు వెలువరించి విమానాన్ని హుటాహుటిన బలవంతంగా కిందికి దింపేందుకు యత్నించారు. విమానాన్ని కిందికి దింపే తొలి ప్రయత్నం ఫలించలేదని, తరువాతి దశలో విమానం రన్‌వేనుబలంగా తాకింది. దీంతో మంటలు చెలరేగాయి. 
 
ఒక్కరోజు క్రితమే అమెరికాలో విమానం ఒకటి అదుపు తప్పి రన్‌వే నుంచి పక్కనున్న నదిలోకి దూసుకుపోయింది. ఈ ఘటన సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇపుడు రష్యాలోని ప్రధాన విమానాశ్రయంలోనే ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం.