గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (13:02 IST)

డోనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు అమెరికా ఆర్థికవ్యవస్థ మటాష్

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుకావడం తథ్యమని ప్రపంచ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుకావడం తథ్యమని ప్రపంచ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై నిషేధం.. అమెరికన్ ఉద్యోగాలు అమెరిక్లకే దక్కేందుకు హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే. ఈ రెండు నిర్ణయాలు ఆ దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతికూలంగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
ముఖ్యంగా దేశానికి టాప్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టులుగా ఉన్న టూరిజం, ఉన్నతవిద్యపై దెబ్బకొట్టడం అమెరికా ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. హెచ్-1బీ వీసా సవరణలు, ఇతర ట్రంప్ ఆదేశాలు అమెరికా ఎకానమీని కుదుటపడేలా చేయలేవన్నారు. మరోవైపు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, ఏడు దేశాలపై నిషేధం విధించడం అమెరికాను సందర్శించే ఇతర దేశాల పర్యాటకులపైన, విద్యార్థులపైన ప్రభావం చూపనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 
 
అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయం అత్యంత కీలకంగా ఉంది. గత 2015లో వీరి నుంచి 199 బిలియన్ డాలర్ల (రూ.13,40,464కోట్లకు పైగా) ఆదాయం చేకూరింది. ట్రావెల్, టూరిజం అమెరికా ఎక్స్పోర్టులో 9 శాతంగా ఉంది. ఇపుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్‌ విదేశీ పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఆదేశాలు కేవలం పర్యాటకులపైనే కాకుండా వస్తువులు, సర్వీసుల రూపంలో జరిగే గ్లోబల్ ఎక్స్చేంజ్‌లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు పేర్కొంటున్నారు.