శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (11:31 IST)

డ్రాగన్ కంట్రీ కొత్త ఆంక్షలు.. భారత్‌తో పాటు విదేశీయులపై వీసా నిషేధం

కరోనా మహమ్మారి నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా తాజాగా కొత్త ఆంక్షలను విధించింది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాల విదేశీయులపై వీసా నిషేధాన్ని చైనా విధించింది. వీసా ఉన్నవారికి కూడా తాత్కాలికంగా ఎంట్రీని నిలిపివేస్తున్నట్లు ఢిల్లీలో ఉన్న చైనా ఎంబసీ ప్రకటించింది. అయితే దౌత్యపరమైన, సేవాపరమైన, సీ వీసాలు ఉన్నవారికి ఈ నిషేధం వర్తించదు అని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. 
 
అత్యవసరం ఉన్నవారు, మానవతా సాయం చేసేవారు.. చైనా ఎంబసీలో దరఖాస్తు చేసుకోవచ్చు అని ఎంబసీ వెల్లడించింది. కరోనా పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని చైనా వెల్లడించింది. చైనా విధించిన నిషేధం కేవలం భారత్‌కు మాత్రమే కాదు అని, ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
నవంబర్ 3వ తేదీ తర్వాత వీసాలు జారీ అయినవారికి ఈ ఆంక్షలు వర్తించవు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, బంగ్లాదేశ్‌, పిలిప్పీన్స్ దేశాల నుంచి వస్తున్న వారిపైన కూడా చైనా తాత్కాలిక నిషేధం విధించింది. తాత్కాలిక నిషేధానికి సంబంధించి చైనా ఎంబసీ తన నోట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.