శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (20:50 IST)

ఫిబ్రవరిలోనే రానున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్.. మూడో దశ ప్రయోగాలు..?

భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఫిబ్రవరిలోనే రానుంది. కరోనా వైరస్‌ నిర్మూలనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌)తో కలిసి భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
 
కోవాగ్జిన్‌ టీకా వచ్చే ఏడాది మార్చి తర్వాత అందుబాటులోకి వస్తుందని తొలుత ఐసిఎంఆర్‌ అంచనా వేసినప్పటికీ, మొదటి రెండు దశల ఫలితాలు ఆశాజనంగా ఉండడంతో.. వ్యాక్సిన్‌ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఐసిఎంఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త రజనీకాంత్‌ అన్నారు. 
 
మూడో దశ ప్రయోగాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు. మూడోదశ ప్రయోగాలు కాకముందే వ్యాక్సిన్‌ అందజేస్తారా అన్న ప్రశ్నకు దీనిపై ఐసిఎంఆర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
 
ఫేజ్‌-1, ఫేజ్‌-2 ప్రయోగాల్లోనూ, జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనూ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేసిందని చెప్పారు. అయితే, మూడోదశ ఫలితాలు పూర్తికాకుండా నూరు శాతం కచ్చితంగా పనిచేస్తుందని అప్పుడే చెప్పలేమని తెలిపారు.