అమెరికా ప్రతినిధుల సభకు వరంగల్ నిట్ అమ్మాయి.. మరో ఐదుగురు మహిళలు కూడా..
అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో అనేక మంది భారతీయులు విజయకేతనం ఎగురవేశారు. ఇలాంటి వారిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆరుగురు భారతీయ మహిళలు ఉన్నారు. వీరిలో పద్మ కుప్ప గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నిట్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసిన పద్మ.. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా, ఆమె మిచిగాన్ 41వ జిల్లా నుంచి రాష్ట్ర ప్రతినిధుల సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఈ సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్, హిందువు ఈమే కావడం గమనార్హం.
1966లో భారత్‌లోని వరంగల్‌లో జన్మించిన పద్మ... నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులు ఆమెను అమెరికా తీసుకెళ్లారు. లాంగ్ ఐలాండ్‌లో కిండర్ గార్డెన్‌లో చేరారు. 1981లో తిరిగి భారత్ వచ్చేశారు. హైదరాబాద్‌లోని స్టాన్లీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు.
ఆ పిమ్మట వరంగల్ ఆర్‌ఈసీ(నిట్)లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1988లో విద్యార్థిగా తిరిగి అమెరికా వెళ్లారు. భర్త సుధాకర్ తాడేపల్లి, ఇద్దరు పిల్లలతో మిచిగాన్‌లోని ట్రాయ్‌లో స్థిరపడ్డారు. ట్రాయ్ ప్లానింగ్ కమిషనర్‌గా రెండేళ్లు పనిచేశారు.
2018 ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో రెండోసారి కూడా విజయం సాధించారు. హిందూత్వ సిద్ధాంతానికి ఆమె సానుభూతిపరురాలు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు తరచూ విరాళాలు ఇస్తుంటారు.
మిగిలిన ఐదుగురు మహిళల్లో జెనీఫర్ రాజ్‌కుమార్ (న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ), నైమా కులకర్ణి (కెంటుకీ స్టేట్ హౌస్), కేషా రామ్ (వెర్మెంట్ స్టేట్ సెనెట్), వందనా శ్లాటర్ (వాషింగ్టన్ స్టేట్ హౌస్), ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్ స్టేట్ హౌస్)లు ఉన్నారు.