అమెరికాలో ఏం జరుగుతోంది.. ఆయుధాలతో కౌంటింగ్ కేంద్రాలకు...
అమెరికాలో ఏదో జరుగబోతోంది. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం లాంఛనంగా మారింది. అయితే, ఈ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను మార్చే రాష్ట్రాల్లో అరిజోనా ఒకటి. ఇక్కడ ఓట్ల లెక్కింపు కూడా దాదాపుగా పూర్తయింది. ఇక్కడ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 50.7శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆయన గెలుపు ఇక్కడ లాంఛనమే.
అయితే బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ట్రంప్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. చివరి ఓటు వరకు లెక్కించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న మరికోపా కౌంటీ ఎలక్షన్ కేంద్రానికి 150 మందికి పైగా ట్రంప్ అభిమానులు చేరుకున్నారు. 'చివరి ఓటు వరకు లెక్కించండి.. ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయి.. డెమొక్రాట్స్ అక్రమాలకు పాల్పడ్డారు..' అంటూ నినాదాలు చేశారు.
సుమారుగా 150 మందికి పైగా ఉన్న ట్రంప్ మద్దతుదారుల్లో కొంత మంది వద్ద ఏఆర్-150 రైఫిల్స్ ఉన్నాయి. మరికొందరి వద్ద ఇతర మారణాయుధాలు ఉన్నాయి.. బైడెన్‌కు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తున్నారు.
కొంతమంది చేతుల్లో ఆయుధాలు కూడా ఉన్నాయని.. అయినప్పటికీ ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఆటంకం రాకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని మరికోపా కౌంటీ చీఫ్ డిప్యూటీ రికార్డర్ కీలే వర్వెల్ స్పష్టం చేశారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారమే ఫలితాన్ని వెల్లడిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా.. ఎన్నికల్లో జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ రిపబ్లికన్లు ఆరోపణలు చేస్తున్నారు. 'అరిజోనా రాష్ట్రంలో ట్రంప్ ఓటమిపాలయ్యేలా ఎన్నికల అధికారులు డెమోక్రాట్స్‌తో కుమ్మక్కయ్యారు. అరిజోనాలో ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడం ద్వారా బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలవాలనుకుంటున్నారు. బైడెన్ గెలుపును నేను అంగీకరించను.. ఓ కమ్యూనిస్ట్ పాలనలో నేను బతకాలనుకోవడం లేదు' అని ట్రంప్ అభిమాని, 67 ఏళ్ల జిమ్ విలియమ్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.